అమెరికాలో ‘‘అయోధ్య’’ సంబరాలు 

అయోధ్యలో రామ మందిరానికి భూమిపూజ  సందర్భంగా అమెరికాలోని భారతీయులు దీపావళిలా వేడుకలు చేసుకున్నారు. బుధవారం శంకుస్థాపన సమయంలో అమెరికాలో రాత్రి అయినా చాలా మంది నిద్ర మానుకుని అదే సమయంకు దీపాలు వెలిగించి పూజలు చేశారు. 

వాషింగ్టన్ తో సహా అనేక చోట్ల హిందువులు వర్చువల్ ప్రోగ్రామ్ లు నిర్వహించారు. అమెరికాలోని విశ్వహిందూ పరిషద్  తరఫున వాషింగ్టన్ లో డిజిటల్ రామ మందిరాన్ని ప్రదర్శించేలా ప్రత్యేకంగా ఓ శకటం రూపొందించారు. మంగళవారం జైశ్రీరాం నినాదాలను వినిపిస్తూ ఆ శకటాన్ని నగరం అంతటా తిప్పారు. 

కరోనా కారణంగా ర్యాలీలు, ఇతర కార్యక్రమాలకు అవకాశం లేకపోవడంతో హిందూ సంఘాలు వర్చువల్ కార్యక్రమాలను నిర్వహించాయి. న్యూయార్క్ లోని ఐకానిక్ టైమ్ స్క్వేర్ వద్ద కూడా భారీ స్క్రీన్ లపై శ్రీరాముడు, ప్రతిపాదిత రామ మందిరం ఫొటోలను ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు. 

వర్చువల్ కార్యక్రమాలు భారీగానే జరిగినా ఎక్కువ మంది మాత్రం తమ ఇండ్లలోనే దీపాలు వెలిగిస్తూ వేడుకలు చేసుకున్నారు. రామ మందిరానికి శంకుస్థాపనపై కెనడాలోని హిందువులూ సంతోషం వ్యక్తం చేశారు. కెనడాలోని హిందూ సంతతికి బ్రాంప్టన్ సిటీ మేయర్ ప్యాట్రిక్ బ్రౌన్ శుభాకాంక్షలు తెలిపారు.