మావోయిస్టుల మందుపాతరకు ఇద్దరు గిరిజనులు బలి

మావోయిస్టు వారోత్సవాలు ప్రశాంతంగా ముగిసిపోయాయనుకుంటున్న తరుణంలో విశాఖ ఏజెన్సీలో విషాద సంఘటన సోమవారం వెలుగు చూసింది. మందుపాతర‌కు ఇద్దరు గిరిజనులు బలయ్యారు. 
 
తమ పశువులు కన్పించకపోవడంతో వెతకడానికి ఆదివారం మధ్యాహ్నం ఇంటి నుంచి అడవిలోకి పెదబయలు మండలంలోని అతి మారుమూల ప్రాంతమైన జమిగూడ పంచాయతీ చింతలవీధికి చెందిన మొండిపల్లి మోహనరావు (25), మొండిపల్లి అజయ్ కుమార్‌ (15) వెళ్లారు. సోమవారం ఉదయానికి కూడా వారు తిరిగి రాలేదు. 
 
దీంతో, కుటుంబ సభ్యులు వెతకగా, అడవిలో వారి మృతదేహాలు కన్పించాయి. భూమిలో అమర్చిన మందుపాతరపై కాలుపెట్టడంతో అది పేలి వారిద్దరూ మృతి చెందినట్లు నిర్థారణకు వచ్చారు. ఈ మందుపాతరను కూంబింగ్‌ నిర్వహిస్తున్న పోలీసుల లక్ష్యంగా మావోయిస్టులు అమర్చి ఉంటారని అనుమానిస్తున్నారు. 
 
మందుపాతర‌ పేలడంతో బలమైన గాయాలై గిరిజనులు ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారని ఎస్‌ఐ రాజారావు తెలిపారు. గత నెల 28 నుంచి ఈ నెల మూడో తేదీ వరకూ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలకు మావోయిస్టులు పిలుపునిచ్చారు. 
 
వారోత్సవాల కాలంలో ఏ ఒక్క హింసాత్మక ఘటనా జరగకుండా ఆంధ్ర, ఒడిశా పోలీసులు సంయుక్తంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కూంబింగ్‌ ముమ్మరంగా నిర్వహించారు. ఒడిశాలోని ముకుడుపల్లి, ఏజెన్సీలోని పెదబయలు మండలం లండులు అటవీ ప్రాంతంలో పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పుల ఘటన చోటు చేసుకోగా గాయాలతో మావోయిస్టులు త్రుటిలో తప్పించుకున్నారు.

జి.మాడుగుల మండలం కిల్లంకోట, మల్కన్‌గిరి జిల్లా పరిధిలోని గుజ్జెడు అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ మావోయిస్టు హతమయ్యాడు. మిగిలిన మావోయిస్టులు ఈ ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నారు. తర్వాత వారోత్సవాలను మావోయిస్టులు ప్రారంభించినప్పటికీ ఈ ఏడాది పెద్దగా ప్రభావం చూపలేదు.

అడవుల్లో సంచరించే పోలీసు పార్టీలను మట్టుబెట్టాలనే వ్యూహంతో మావోయిస్టులు భారీగా ఏర్పాటు చేస్తున్న మందు పాతరలను గిరిజనులకు ప్రాణ సంకటంగా మారాయి.  ఇలాంటి మందు పాతరలు ఏవోబీ వ్యాప్తంగా అటవీ ప్రాంతాల్లో మావోయిస్టులు భారీగా ఏర్పాటు చేస్తున్నారని తెలిసింది.

ఈ మందుపాతరల ఉనికిని పోలీసులు పసిగడుతున్నప్పటికీ ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనులు మాత్రం గుర్తించక ప్రాణాలు మీదకు తెచ్చుకుంటున్నారు. గిరిజనులకు అటవీ ప్రాంతాల్లో సంచరించి పశువుల కాపల, అటవీ ఉత్పత్తులు సేకరిస్తుంటారు. ఈ పరిస్థితుల్లో మందు పాతరలను గిరిజనులు గుర్తించలేకపోతున్నారు.