దేశంలో ఆక్స్‌ఫర్డ్‌ టీకా తదుపరి ట్రయల్స్‌

ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ తయారుచేస్తున్న కరోనా టీకాకు దేశంలో రెండు, మూడో దశ హ్యూమన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించేందుకు సీరం ఇన్‌స్టిట్యూట్‌కు (ఎస్‌ఐఐ) డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) అనుమతినిచ్చింది. ఈ మేరకు  డీసీజీఐ వీజీ సొమానీ ఉత్తర్వులు జారీ చేసినట్టు ఎస్‌ఐఐ పేర్కొంది. 
 
18 ఏండ్లు వయసు పైబడిన 1600 మంది వలంటీర్లకు ఈ వ్యాక్సిన్‌ ఇవ్వనున్నారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా 17 ప్రాంతాల్లో ప్రయోగాలు నిర్వహించనున్నారు. కాగా ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌కు సంబంధించి ప్రస్తుతం బ్రిటన్‌లో రెండు, మూడో దశ.. బ్రెజిల్‌లో మూడో దశ, దక్షిణాఫ్రికాలో ఒక, రెండో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ జరుగుతున్నాయి. 
 
కొవాగ్జిన్‌ టీకాపై  హైదరాబాద్‌ నిమ్స్‌ హాస్పిటల్‌లో  క్లినికల్‌ ట్రయల్స్‌ మొదటిదశ ముగిశాయి. గతనెల 20వ తేదీన మొదలైన క్లినికల్‌ ట్రయల్స్‌లో ఇప్పటివరకు 40మంది వలంటీర్లపై ప్రయోగాలు జరిగినట్లు చెబుతున్నారు. 
 
మరోవంక, ప్రముఖ ఔషధ తయారీ సంస్థ వాక్‌హార్డ్‌ కరోనా వ్యాక్సిన్లు సరఫరాచేసేందుకు బ్రిటన్‌ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. వాక్‌హార్డ్‌ అనుబంధ సంస్థ సీపీ ఫార్మాస్యూటికల్స్‌ తయారుచేస్తున్న వ్యాక్సిన్‌తోపాటు ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ అభివృద్ధిచేస్తున్న ఏజెడ్‌డీ1222 వ్యాక్సిన్ల ఉత్పత్తి సరఫరా కోసం బ్రిటన్‌తో ఒప్పందం చేసుకున్నట్టు వాక్‌హార్డ్‌ సంస్థ చైర్మన్‌ హబిల్‌ ఖొరాకివాలా వెల్లడించారు. వచ్చే కొద్ది నెలల్లో 60 లక్షల డోసుల వ్యాక్సిన్‌ను సరఫరాచేస్తామని తెలిపారు.