చంద్రబాబు నోట తాజా ఎన్నికల మాట 

మూడు రాజధానుల విషయమై అధికార, ప్రతిపక్ష నేతల మధ చెలరేగిన మాటల యుద్ధంలో శాసన సభ్యత్వాలకు రాజీనామా చేసి తాజా ఎన్నికలకు సిద్ధం కావాలనే సవాళ్లు ఎదురవుతున్నాయి. మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్న టిడిపి ఎమ్యెల్యేలు అందరు తమ పదవులకు రాజీనామా చేసి, తాజాగా ప్రజా తీర్పు కోరాలని పౌరసరఫరాల మంత్రి నాని గత వారం డిమాండ్ చేశారు. 
 
తాజాగా, టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా అసెంబ్లీ రద్దు చేసి తాజా ఎన్నికలకు సిద్ధం కావాలని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిని సవాల్ చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్.. అమరావతికి మద్దతు ఇచ్చి ఎన్నికల తర్వాత మాట తప్పారని ఆయన గుర్తుచేశారు. 
 
మాట తప్పినందుకు ప్రభుత్వాన్ని రద్దు చేసి ప్రజల్లోకి వెళ్దామని సీఎం జగన్‌కు చంద్రబాబు సవాల్ విసిరారు. మూడు రాజధానులను ఎన్నికల ముందు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. ఏపీ రాజధాని ఐదు కోట్ల ప్రజల సమస్య అని చెప్పారు. కులాలు, మతాల సమస్య కాదని చంద్రబాబు స్పష్టం చేశారు. 
 
ఏపీ ప్రజలను వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. ప్రభుత్వం రద్దు చేసి ఎన్నికలకు వెళ్లడానికి 48 గంటలు సమయం ఇస్తున్నామని చంద్రబాబు తెలిపారు. తామందరం రాజీనామా చేస్తామని చెప్పారు..వైసీపీ కూడా రాజీనామా చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. 
 
అయితే ఈ విషయమై అధికార పక్షం రాజీనామా చేయక పోయినా టిడిపి సభ్యులు రాజీనామా చేసి తాజా ఎన్నికలకు సిద్ధ పడతారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ విషయమై టిడిపి వర్గాలలో సమాలోచనలు జరుగుతున్నట్లు తెలుస్తున్నది. 
 
ఐదు సంవత్సరాలకు ఎన్నుకున్నారని రాష్ట్ర భవిష్యత్ ను సమాధి చేసే అధికారం ఉండదని ఈ సందర్భంగా జగన్ ను చంద్రబాబు విమర్శించారు. 
 
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సహితం రాష్ట్రం లోని టిడిపి ఎమ్యెల్యేలతో పాటు కృష్ణ, గుంటూరు జిల్లాలలోని వైసిపి ఎమ్యెల్యేలు రాజీనామాలు చేసి అమరావతి రైతుల పక్షాన నిలవాలని పిలుపిచ్చారు. ఇప్పుడు కరోనా కారణంగా ప్రజా ఉద్యమం సాధ్యం కానందున మూడు రాజీనామాల విధానంపై న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు. 
 

మరోవంక,  అమరావతి కోసం తొందరపడి ఎవరూ రాజీనామాలు చేయొద్దని నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు సూచించారు. జనసేన అధినేత పవన్ రాజీనామా వ్యాఖ్యలపై స్పందిస్తూ రాజీనామాలు వృథా ప్రయాస కాగలవని స్పష్టం చేశారు.  చేయాల్సింది రాజీనామాలు కాదని, రాజీలేని పోరాటమని పిలుపిచ్చారు.

ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన బీటెక్ రవి గురించి మాట్లాడుతూ రాజీనామాను ఉపసంహరించుకోవాలని కోరారు.
కౌన్సిల్‌లో ఉండి పోరాటం చేయాలని హితవు చెప్పారు.  రాజీనామా చేస్తే తనలాగా రక్షణ లేకుండా పోతుందని, తనకైతే కేంద్రం భద్రత కల్పిస్తుందన్న నమ్మకముందని పేర్కొన్నారు.