కేరళ సీఎం రాజీనామాకై కేంద్ర మంత్రి దీక్ష 

కేరళ బంగారం స్మగ్లింగ్ కేసుకు సంబంధించి ముఖ్యమంత్రి  పినరయి విజయన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర విదేశీ, పార్లమెంట్ వ్యవహారాల సహాయ మంత్రి వీ మురళీధరన్ ఢిల్లీలో ఆదివారం ఒక రోజు నిరాహాద దీక్ష చేపట్టారు. దుబాయ్ నుంచి బంగారాన్ని దౌత్య మార్గంలో అక్రమంగా రవాణా చేసిన కేసు కేరళ ప్రభుత్వాన్ని కుదిపేస్తున్నది. 

ఈ కేసులో నిందితురాలైన స్వప్న సురేశ్‌తో సీఎం విజయన్, ఆయన మాజీ ప్రధాన కార్యదర్శి శివశంకర్‌కు సంబంధం ఉన్నదని ఆ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో సీఎం పదవికి విజయన్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ఈ కేసులో నిందితులుగా ఉన్న స్వప్న సురేశ్ తో కేరళ సిఎం విజయన్ కు, ఆయన మాజీ కార్యదర్శి శివశంకర్ కు సంబంధాలు ఉన్నాయని మురళీధరన్ ఆరోపించారు. ఈ క్రమంలోనే సిఎం విజయన్ తన పదవికి రాజీనామా చేయాలని కేంద్ర మంత్రి డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ పార్టీ ఇటీవల కేరళలో నిరసన ప్రదర్శనలు నిర్వహించగా తాజాగా బీజేపీ శనివారం నుంచి 18 రోజుల పాటు సత్యాగ్రహ దీక్షలకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు నిరాహార దీక్షలు చేపడుతున్నారు. బీజేపీ ఎమ్మెల్యే భూపేందర్ యాదవ్ శనివారం నిరాహార దీక్షతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా కేంద్ర సహాయ మంత్రి మురళీధరన్ ఆదివారం ఢిల్లీలో ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టారు.