జిఎస్‌టి వసూళ్లు 15 శాతం తగ్గాయ్

జూలైలో జిఎస్‌టి (వస్తు, సేవల పన్ను) వసూళ్లు తగ్గాయి. గత నెలలో ప్రభుత్వ జిఎస్‌టి వసూళ్లు రూ.87,422 కోట్లు నమోదవగా, అంతకుముందు జూన్ లో వసూళ్ల కంటే ఇవి తక్కువగానే ఉన్నాయి. జూలైలో వచ్చిన రూ.87,422 కోట్లలో రూ.16,147 కోట్ల సిజిఎస్‌టి, రూ.21,418 కోట్ల ఎస్‌జిఎస్‌టి, రూ.42,592 కోట్ల ఐజిఎస్‌టి ఉన్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. 

ఇవే కాకుండా రూ  7,265 కోట్ల సెస్‌ను అందుకుంది. గత నెలలు అయిన ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌కు సంబంధించి పన్నులను పెద్దమొత్తంలో చెల్లించారని, అయితే కోవిడ్19 కారణంగా పన్ను చెల్లింపుదారు లు ఊరట పొందారని ఆర్ధిక మంత్రిత్వ శాఖ తెలిపింది.

రూ.5 కోట్ల లోపు టర్నోవర్ ఉన్న వ్యాపారాలకు సెప్టెంబర్ వరకు రిటర్న్ దాఖలుకు మినహాయింపు ఇస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. జిఎస్‌టి వసూ ళ్లు 2020 జూన్‌లో రూ.90,917 కోట్లుగా ఉన్నాయి. ఈ విధంగా జూన్‌తో పోలిస్తే జూలైలో జిఎస్‌టి వసూళ్లలో రూ.3,495 కోట్ల తగ్గుదల ఉంది. 

అయితే గతేడాది జూలైలో జిఎస్‌టి వసూళ్లు రూ .1.2 లక్షల కోట్లుగా ఉన్నాయి. 2020 జూలైలో ఉత్తరాఖండ్, ఢిల్లీ, హర్యానా, తమిళనాడు, మహారాష్ట్ర, జమ్మూకాశ్మీర్, పశ్చిమ బెంగాల్‌లో జిఎస్‌టి వసూళ్లు తగ్గాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. అదే సమయంలో రాజస్థాన్, నాగాలాండ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్లలో స్వల్ప వృద్ధి నమోదైంది.