టిమ్స్ లో వసతులపై కిషన్‌ రెడ్డి అసంతృప్తి

అత్యంత వేగంగా కరోనా వైరస్‌ విస్తరిస్తోన్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.  ట్రేసింగ్‌, టెస్టింగ్‌, ట్రీట్‌మెంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అమలు చేయాలని సూచించారు.

గచ్చిబౌలిలోని టిమ్స్‌ ఆసుపత్రిలో అందుతున్న వైద్య వసతులను పరిశీలించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి టిమ్స్‌లోని వసతులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆసుపత్రిని వేయి పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేయమని సూచిస్తూ ఆస్పత్రిలోని వసతులను మరింత మెరుగుపర్చాల్సిన అవసరముందని చెప్పారు.

అలాగే కరోనాను కట్టడి చేస్తోన్న ఢిల్లీని తెలంగాణ ప్రభుత్వం ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. వైద్య సిబ్బందికి జీతాలతోపాటు, అదనంగా ప్రోత్సాహకాలు అందించాలని కోరారు. కరోనా బారిన పడిన వారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

కరోనా మరణాలను తెలంగాణ ప్రభుత్వం దాచడం సరికాదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తపుబట్టారు.  వైద్య సిబ్బందిని మరింత మందిని తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి చెప్పారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రైవేట్  ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

బయట తిరుగుతోన్న హోమ్‌ ఐసోలేషన్లో పేషెంట్స్‌ను ప్రభుత్వం గుర్తించాలని సూచించారు. అనారోగ్యంగా ఉన్న వ్యక్తులు ఇంటి గడప దాటి బయటకు రావొద్దని హితవు చెప్పారు. ఆగస్టు ప్రజలు మరింత జాగ్రత్తలు పాటించాలని కిషన్‌రెడ్డి సూచించారు.