చిన్నారుల ద్వారా కూడా కరోనా వ్యాప్తి?

చిన్నా, పెద్దా అన్న తేడా లేకుండా అందరిపైనా కరోనా మహమ్మారి విరుచుకుపడుతోంది. నిన్న మొన్నటివరకు 65 ఏళ్ల పైబడిన వృద్ధులు అది కూడా మధుమేహం, బిపి, గుండెజబ్బులు లాంటి ఇతర వ్యాధులతో బాధపడే వారు ఈ వైరస్ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉందని భావిస్తూ వచ్చారు. తాజాగా ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. 

అయితే యువత ద్వారానే వైరస్ ఎక్కువగా వ్యాప్తి అవుతోందని కాస్త ఎక్కువ వయసు ఉన్న పిల్లలు, పెద్దవాళ్లకన్నా కూడా అయిదేళ్లలోపు పిల్లల ముక్కులో కరోనావైరస్‌కు సంబంధించిన జన్యుపదార్థాలు ఉంటున్నాయని తాజాగా నిర్వహించిన పరిశోధనలో వెల్లడయింది. దీంతో ఇప్పడు ప్రపంచవ్యాప్తంగా మూతపడిన పాఠశాలలు, డేకేర్ సెంటర్లను తిరిగి తెరవడంపై భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. 

మిగతా వయసుల వారిలాగానే చిన్న పిల్లలు కూడాఈ వైరస్ వ్యాప్తికి కారణమవుతారనే విషయం ఈ అధ్యయనంతో వెల్లడవుతోంది. ‘జామా’పీడియాట్రిక్ జర్నల్‌లో ఈ పరిశోధన వ్యాసం ప్రచురితమంది. కరోనా విజృంభణ ఎక్కువగా ఉన్న సమయంలో పాఠశాలులు, డేకేర్ సెంటర్లను వేగంగా మూసి వేయడంతో చిన్న పిల్లలద్వారా ఈ వైరస్ వ్యాపి జరుగుతుందనే విషయాన్ని పెద్దగా గుర్తించలేకపోయారని వారు అభిప్రాయపడ్డారు. 

‘పెద్దపిల్లలు, వయోజనులకన్నా స్వల్ప, మధ్యస్థ కరోనా లక్షణాలు కలిగిన అయిదేళ్ల లోపు చిన్న పిల్ల్లల ముక్కులోపల సార్స్‌కోవ్2 వైరల్ ఆర్‌ఎన్‌ఎ మెటీరియల్ ఎక్కువగా ఉంటోందని మా విశ్లేషణలో తేలింది’ అని శాస్త్రవేత్తలు ఆ పరిశోధనా వ్యాసంలో పేర్కొన్నారు. అమెరికాలోని ఆన్ అండ్ రాబర్ట్ హెచ్ లురి చిన్న పిల్లల ఆస్పత్రికి చెందిన వారితో సహా పలువురు శాస్త్రవేత్తలు ఈ అధ్యయనంలో పాలుపంచుకున్నారు.

పెద్దవాళ్లకన్నా కూడా చిన్నపిల్లల ద్వారా ఈ వైరస్ ఒకరినుంచి మరొకరికి వేగంగా సోకుతుందనే విషయం దీనివల్ల తెలుస్తోందని అమెరికా ఆస్పత్రిలో చిన్న పిల్లలకు సోకే వ్యాధులకు సంబంధించిన స్పెషలిస్టు, ఈ పరిశోధనకు నాయకత్వం వహించిన హించిన హీల్డ్‌సార్జెంట్ వ్యాసంలో పేర్కొన్నారు. 

కరోనా లక్షణాలు కనిపించిన వారం రోజులలోపే స్వల్ప, మధ్యస్థ లక్షణాలతో బాధపడుతున్న 145 కేసులను ఈ శాస్త్రజ్ఞులు అధ్యయనం చేశారు. అయిదేళ్లలోపు పిల్లలు, అయిదునుంచి 17 ఏళ్ల పిల్లలు, 1865 ఏళ్ల వయోజనులు ఇలా మూడు కేటగిరీల వారిపై వారు పరిశోధనలు జరిపారు. 

పెద్దవాళ్లలాగే చిన్న పిల్లలు కూడాఈ వైరస్‌ను వ్యాప్తి చేస్తారని నిరూపించడం తమ పరిశోధన ఉద్దేశంకాదని, అయితే అందుకు అవకాశముందని చెప్పడమేనని హీల్డ్ సార్జెంట్ తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు కృషి కొనసాగుతున్నందున ఈ విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవలసిన అవసరం ఉందని కూడా ఆయన అన్నారు. అంతేకాదు, కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత టీకాలు వేసే సమయంలో ముందుగా వీరిపై దృష్టిపెటాల్సిన అవసరం ఉంది అని కూడా ఆయన పేర్కొన్నారు.