అధ్యక్ష ఎన్నికలను వాయిదా వేయాలి

నవంబరులో జరగాల్సిన అమెరికా అధ్యక్ష ఎన్నికలను వాయిదా వేయాలని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సూచించారు. ప్రజలు సరిగ్గా, భద్రంగా, సురక్షితంగా ఓటు వేయగలిగేవరకు ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ ఆయన ట్వీట్‌ చేశారు. మెయిల్‌-ఇన్‌ ఓటింగ్‌కు అనుమతి ఇస్తే ఎన్నికల్లో అవకతవకలు జరుగుతాయని, ఫలితాలు తారుమారు కావొచ్చని హెచ్చరించారు. 
 
అలా జరిగితే ఈ ఎన్నికలు అమెరికా చరిత్రలోనే అవమానకరమైన సంఘటనగా మిగిలిపోతాయని స్పష్టం చేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో మెయిల్‌ ద్వారా ఓటేసే సదుపాయాన్ని కల్పించాలని రాష్ట్రాలు కోరుతున్నాయి. అయితే అమెరికాలో అధ్యక్ష ఎన్నికలను వాయిదా వేయాలంటే రాజ్యాంగ సవరణ జరగాలి. 
 
మరోవైపు,  చైనా, రష్యా, భారత్‌లు తమ దేశాల్లో పర్యావరణ పరిరక్షణను పట్టించుకోవని ట్రంప్‌ ఆరోపించారు. అమెరికా మాత్రం ఆ పని చేస్తుందని చెప్పుకొచ్చారు. కర్బన ఉద్గారాల తగ్గింపునకు సంబంధించిన పారిస్‌ ఒప్పందం నుంచి అమెరికా బయటకు రావాలని తాను తీసుకున్న నిర్ణయాన్ని ఆయన మరోమారు సమర్థించుకున్నారు.   
 
మరోవంక, దేశ అధ్యక్ష ఎన్నికలను చైనా తన సోషల్‌ మీడియా యాప్‌ ‘టిక్‌టాక్‌’ ద్వారా ప్రభావితం చేస్తుందేమోనని, ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకుంటుందేమోనని అమెరికాలోని ఏడుగురు టాప్‌ రిపబ్లికన్‌ పార్టీ సెనెటర్లు ఆందోళన వ్యక్తం చేశారు.
 
ఈ మేరకు తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ డైరెక్టర్‌ జాక్‌ రాట్‌క్లిఫె, ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ డైరెక్టర్‌ క్రిష్టోఫర్‌ రే, హోంల్యాండ్‌ సెక్యూరిటీ తాత్కాలిక సెక్రటరీ చాంద్‌ వూల్ఫ్‌లకు లేఖ రాశారు. దేశాధ్యక్ష ఎన్నికల నిర్వహణలో భద్రత, సమగ్రతను కాపాడేందుకు ట్రంప్‌ ప్రభుత్వం సరైన చర్యలే తీసుకున్నదని పేర్కొన్నారు.