చైనా సరిహద్దులో భారీగా భారత్ సైన్యం 

తూర్పు ల‌ఢ‌క్‌లోని స‌రిహ‌ద్దులో భార‌త్ సైన్యం చైనాను అధిగ‌మించింది. అక్క‌డ 35 వేల మంది ప్ర‌త్యేక సైనికుల‌ను ఆర్మీ మోహ‌రించింది. వీరంతా అత్యంత క‌ఠినమైన సియాచిన్‌, ల‌ఢ‌క్ వంటి శీత‌ల ప్రాంతాల్లో విధులు నిర్వ‌హించిన వారేన‌ని సైనిక వ‌ర్గాలు తెలిపాయి. త్వ‌ర‌లో శీతాకాలం స‌మీపిస్తుండ‌టంతో అక్క‌డ వాతావ‌ర‌ణ పరిస్థితుల‌ను సైనికులు త‌ట్టుకునేందుకు త‌గిన ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు వెల్ల‌డించాయి.

సైన్యానికి అవ‌స‌ర‌మైన వెచ్చ‌ని క్యాబిన్లు, ఇత‌ర సామాగ్రిని స‌మ‌కూర్చుతున్న‌ట్లు ప్ర‌భుత్వ వ‌ర్గాలు తెలిపాయి. తూర్పు ల‌ఢ‌క్ ప్రాంతంలో మోహ‌రించిన భార‌త జ‌వాన్లు అత్యంత క్లిష్ట‌మైన వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల‌ను త‌ట్టుకోగ‌ల‌ర‌ని పేర్కొన్నారు. అత్యంత శీత‌ల ప్రాంతాలైన  సియాచిన్‌, తూర్పు, ఉత్త‌ర ల‌ఢ‌క్‌లోని సైనిక శిబిరాల్లో చాలా ఏండ్లు ఉన్న అనుభ‌వం వీరికి ఉంద‌న్నారు. 

మ‌రోవైపు చైనా సైనికులు అత్యంత క్లిష్ట‌మైన వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల‌ను త‌ట్టుకోలేర‌ని ఆ వ‌ర్గాలు చెప్పాయి. భార‌త్ స‌రిహ‌ద్దులోని చైనా సైనికులు 2-3 ఏండ్ల అనంత‌రం ఆ దేశ ప్ర‌ధాన ప్రాంతానికి తిరిగి వెళ్తుంటార‌ని,   దీంతో అతి శీత‌ల ప్రాంతాల్లోని వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల‌ను త‌ట్టుకునే సామ‌ర్థ్యం వారికి లేద‌ని ఆ వ‌ర్గాలు వివ‌రించాయి. 

ప్ర‌స్తుతం ఇరు దేశాల సైనికులు పెట్రోలింగ్ పాయింట్ 14, 15, 17, 17 ఏ నుంచి దూరంగా మ‌ళ్లాయ‌ని పేర్కొన్నాయి. అయితే పీపీ 17, 17 ఏ వ‌ద్ద సుమారు 50 మంది చైనా సైనికులు ఉన్నార‌ని, ఆ దేశ మిగ‌తా సైన్య‌మంతా వారి శాశ్వ‌త శిబిరాల‌కు చేరుకుంద‌ని అధికార వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

ఇలా ఉండగా, భారత్ – చైనా సరిహద్దులోని అన్ని ప్రాంతాల నుంచి సైనికులు వెనక్కి వచ్చేశారని చైనా అధికారులు ప్రకటించినా  అది నిజం కాదని భారత అధికారులు స్పష్టం చేశారు. చైనా బుకాయిస్తుందని, సైనికులు ఇంకా సరిహద్దు ‌‌ నుంచి వెళ్లిపోలేదని చెప్పారు.

“ఈ ప్రక్రియలో కొంచెం ప్రగతి ‌ వచ్చింది. కానీ మొత్తం పూర్తి కాలేదు. దీనిపై చర్చించేందుకు ఇరు దేశాల సీనియర్‌‌ కమాండర్స్‌ సమావేశం అవుతారు” అని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాస్తవా చెప్పారు.