జేఎన్‌యూ సందర్శనకు దీపికకు రూ 5 కోట్లు  

బాలీవుడ్ ప‌్ర‌ముఖ న‌టి దీపికా ప‌దుకొనే  పాకిస్థాన్‌కు చెందిన రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారి అనీల్ ముసార‌త్ సూచ‌న మేరకే ఆమె ఈ ఏడాది జ‌న‌వ‌రిలో జేఎన్‌యూను సంద‌ర్శించారనే ఆరోపణ సంచలనం కలిగిస్తున్నది. 
 
అతని ప్రమేయంతోనే అక్క‌డ పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టానికి వ్య‌తిరేకంగా ఆందోళ‌న చేస్తున్న విద్యార్థుల‌కు మ‌ద్ద‌తు ప‌లికారని రిసెర్చ్ అండ్ ఎనాల‌సిస్ వింగ్  మాజీ అధికారి ఎన్‌కే సూద్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.
 
అందుకై దీపికా ప‌దుకొనేకు ముసార‌త్ రూ.5 కోట్లు ముట్ట‌జెప్పార‌ని తీవ్రమైన ఆరోపించారు. అనీల్ ముసార‌త్‌కు పాకిస్థాన్ ప్ర‌ధాని ఇమ్రాన్‌ఖాన్‌తో స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయ‌ని చెప్పారు. ఇమ్రాన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అతనికి బాలీవుడ్ తో సన్నిహిత సంబంధాలున్నట్లు పేర్కొన్నారు. 
 
జేఎన్‌యూకు వెళ్లే ముందు ఆమెకు రెండు ఫోన్ కాల్స్ వచ్చాయని, ఒకటి కరాచీ నుండి కాగా, మరొకటి దుబాయ్ నుంచి అని సూద్ వెల్లడించారు. కరాచీ నుండి ముసార‌త్ గని, అతని సన్నిహితుడు గాని ఫోన్ చేసి ఉండవచ్చని పేర్కొన్నారు. 
 
ఈ ఏడాది జ‌న‌వ‌రి మొద‌టి వారంలో ఢిల్లీలోని జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ యూనివ‌ర్సిటీ (జేఎన్‌యూ)లో మోదీ ప్ర‌భుత్వం ప్ర‌తిపాదించిన పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టానికి వ్య‌తిరేకంగా విద్యార్థులు నిర‌స‌న‌కు దిగారు. 
 
ఈ సంద‌ర్భంగా ముఖాల‌కు ముసుగులు ధ‌రించి వెళ్లిన కొంద‌రు దుండ‌గులు విద్యార్థుల‌పై దాడికి పాల్ప‌డ్డారు. ఈ దాడిలో దాదాపు 30 మంది విద్యార్థులు గాయ‌ప‌డ్డారు. ఆ సంద‌ర్భంలో దీపికా ప‌దుకొనే జేఎన్‌యూకు వెళ్లి విద్యార్థులకు సంఘీభావం ప్ర‌క‌టించారు.