భీమా కోరేగావ్ కేసులో ఢిల్లీ  ప్రొఫెస‌ర్ అరెస్ట్

భీమా కోరేగావ్ అల్ల‌ర్ల కేసులో ఢిల్లీ యూనివ‌ర్సిటీ ప్రొఫెస‌ర్ హెనీ బాబు ముస‌లియార్వీట్టిల్ థ‌రాయిల్ ‌(54)ను జాతీయ ద‌ర్యాప్తు సంస్థ‌(ఎన్ఐఏ) మంగ‌ళ‌వారం అరెస్టు చేసింది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని గౌత‌మ్ బుద్ధ‌న‌గ‌ర్‌కు చెందిన హెనీ బాబు ఢిల్లీ వ‌ర్సిటీలోని ఇంగ్లీష్ డిపార్ట్‌మెంట్‌లో అసోసియేట్ ప్రొఫెస‌ర్‌గా ప‌ని చేస్తున్నారు.

భీమా కోరేగావ్ అల్ల‌ర్ల కేసులో ఇది 12వ అరెస్టు. ఇప్ప‌టికే పలువురు మేధావులు, లాయ‌ర్లు ఈ కేసులో జైలు పాలైన విష‌యం తెలిసిందే. గ‌త రెండేళ్ల నుంచి ఈ కేసు విచార‌ణ కొన‌సాగుతోంది.  ఈ కేసులో 2018, నవంబ‌ర్ 15న పుణె పోలీసులు ఛార్జిషీటు దాఖ‌లు చేయ‌గా, అనుబంధ  ఛార్జిషీటును 2019, ఫిబ్ర‌వ‌రి 21న దాఖ‌లు చేశారు.

పుణె సమీపంలోని భీమా-కోరేగావ్ వ‌ద్ద‌ 2018 జనవరి 1న  లక్షలాది మంది దళితులు అక్క‌డ స‌మావేశ‌మ‌య్యారు. నాడు జ‌రిగిన హింస దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఆ హింసకు ఒక రోజు ముందు 2017 డిసెంబర్ 31న పుణెలో ఎల్గాన్ పరిషత్‌ను నిర్వహించారు. 

ఈ సదస్సులో చేసిన ప్రశంగాలు మరుసటి రోజు హింసను రాజేశాయని ఆరోపిస్తూ ఫిర్యాదు నమోదైంది. ఆ ఫిర్యాదు ప్రాతిపదికగా పుణె పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేయటం మొదలుపెట్టారు.