శ్రీరామునికి రాఖీలు పంపిన ముస్లిం మహిళలు   

ఉత్తరప్రదేశ్‌లోని మీరఠ్‌ జిల్లాకు చెందిన కొందరు ముస్లిం మహిళలు రక్షాబంధన్ సందర్భంగా శ్రీరామునికి త‌మ త‌ర‌పున క‌ట్టేందుకు రాఖీల‌ను త‌యారుచేసి, వాటిని ముస్లిం రాష్ట్రీయ మంచ్ సహకారంతో అయోధ్య‌లోని రామ్ మందిర్ ట్రస్ట్‌కు పంపారు. 

హిందూముస్లిం మత సామరస్యాన్ని చాటేందుకు ముస్లిం నేషనల్ ఫోరం ఉమెన్స్ సెల్ జాతీయ కన్వీనర్, అడ్వకేట్ షాహీన్ పర్వేజ్ ఈ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు. షాహీన్‌తో పాటు ఆమె స్నేహితురాళ్లు రేష్మా, నీలం, షబ్నం, ఫర్హీన్, ఫర్జనాలు కలిసి రామ్‌లాలా చేతికి క‌ట్టేందుకు రాఖీల‌ను త‌యారు చేశారు. 

ఆగస్టు 3న రక్షాబంధన్ సంద‌ర్భంగా రామ్‌లాలాకు వీటిని క‌ట్టాల‌ని వారు విజ్ఞప్తి చేశారు. భారతదేశంలో నివసిస్తున్న ముస్లింలు మొఘల్ లేదా బాబర్ వారసులు కాదని షాహీన్ స్పష్టం చేశారు. 

ప్రతి భారతీయ ముస్లిం హృదయంలో శ్రీరాముడు కొలువైవున్నాడ‌ని, అయోధ్యలో రామాల‌య‌ నిర్మాణంలో ముస్లింలకు కూడా ముఖ్యమైన పాత్ర ఉంద‌ని ఆమె పేర్కొన్నారు. 

రామ్‌లాలా కోసం ముస్లిం మహిళలు చేసిన ఈ రాఖీలు ఆకర్షణీయంగా ఉన్నాయి. వీటిపై జై శ్రీరామ్ అని రాయ‌డం ద్వారా ముస్లిం మహిళలు త‌మ‌కు శ్రీరామునిపై గ‌ల అపార భ‌క్తిని చాటుకున్నారు.