విదేశీ విద్యార్థులకు అమెరికాలోకి నో ఎంట్రీ

అమెరికా ఫస్ట్ అనే పాలసీతో అధ్యక్ష పదవి చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం మరోసారి వీసాల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే హెచ్‌1బీ వీసాలపై పలు ఆంక్షలు విధించిన అమెరికా ప్రభుత్వం కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో స్టూడెంట్ వీసా నిబంధనల్లోనూ కొన్ని మార్పులు చేర్పులు చేసింది. కేవలం ఆన్‌లైన్ క్లాసుల ద్వారా విద్యనభ్యసించాలనుకునే విద్యార్థులకు అమెరికాలో ఎంట్రీ లేదని ప్రకటించింది.

ప్రస్తుతం కరోనా నేపథ్యంలో యూనివర్సిటీలు, విద్యా సంస్థలను తెరిచి నేరుగా విద్యార్థులను తరగతులకు అనుమతించే పరిస్థితి లేకపోవడంతో ఆన్‌లైన్‌ విధానంలో మాత్రమే బోధన జరుగుతోంది. దీంతో ఆన్‌లైన్ విధానంలో బోధనను ఎంచుకునే వారికి ఎఫ్1 వీసా కోసం దరఖాస్తు చేసుకునే వీలు కల్పించకూడదని అమెరికా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నిర్ణయించింది. 

కొత్తగా అమెరికాలోకి విదేశీ విద్యార్థులను అనుమతించొద్దన్న పాలసీ నిర్ణయాన్ని శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల స్టూడెంట్ వీసాల విషయంలో తీసుకున్న వివాదాస్పదంగా మారడంతో ట్రంప్ తప్పనిసరి పరిస్థితుల్లో వెనుకడుగు వేశారు. యూఎస్‌లో ఉంటూ ఆన్‌లైన్‌ విధానంలో క్లాసులకు హాజరవుతున్న విదేశీ విద్యార్థుల వీసాలను రద్దు చేసి వెనక్కి పంపాలని గత నెలలో ఉత్తర్వులు జారీ చేశారు.

అయితే ఈ నిర్ణయంపై స్వదేశంలోనే వ్యతిరేకత వచ్చింది. దేశంలోని ప్రముఖ యూనివర్సిటీలు హార్వర్డ్, మసాచూసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సహా పలు విద్యాసంస్థలు కోర్టులను ఆశ్రయించాయి. ట్రంప్ సర్కారు నిర్ణయంపై స్టే విధించాలని కోరాయి.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆన్‌లైన్‌ తరగతులపై ఉన్న పరిమితుల్ని ఎత్తివేస్తూ మార్చి 13న ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ తీసుకున్న నిర్ణయానికి ట్రంప్‌ తాజా ఉత్తర్వులు విరుద్ధంగా ఉన్నాయని వాదించాయి. దీంతో జూలై 14న ట్రంప్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. విద్యార్థులను వెనక్కి పంపాలంటూ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేశారు.