కేసులు పెరిగినా టెస్టులు పెంచని కేసీఆర్ 

తెలంగాణలో  కరోనా మహమ్మారి విజృంభిస్తున్నా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే టెస్టుల విషయంలో కేసీఆర్ ప్రభుత్వం ఎప్పుడూ వెనకే ఉంటోంది. రాష్ట్ర జనాభా, కరోనా వైరస్ వ్యాపిస్తున్న తీరును బట్టి ఆయా రాష్ట్రాలు టెస్టుల్లో వేగం పెంచగా మన రాష్ట్రంలో మాత్రం టెస్టుల వైపు దృష్టి సారించడం లేదు. 

దేశంలోని 7 రాష్ట్రాల్లో  టెస్టులు 10 లక్షలు దాటగా, మరో 7 రాష్ట్రాల్లో 5 లక్షలు దాటాయి. తెలంగాణలో మాత్రం ఇప్పటి వరకు టెస్టులు 3.5 లక్షలు కూడా దాటలేదు. కరోనా కేసుల్లో రాష్ట్రం దేశంలో 9వ స్థా నంలో ఉండగా, టెస్టుల్లో 18వ స్థా నంలో నిలిచింది. పక్కనే ఉన్న ఏపీలో గత రెం డు రోజుల్లోనే 1.07 లక్షల టెస్టులు చేయగా రాష్ట్రంలో 28 వేల టెస్టులే చేయడం ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతోంది.

రాష్ట్రంలో రోగ లక్షణాలు ఉన్న వారికే టెస్టులు చేస్తామంటూ చాలా మందికి టెస్టులను నిరాకరిస్తున్నారు. ఇంట్లో ఒకరికి పాజిటివ్ వచ్చిందని తెలిసినా రోగ లక్షణాలు లేవంటూ మిగతావారికి టెస్టులు చేయడం లేదు. రాష్ట్రంలో టెస్టింగ్ సామర్ధ్యం పెంచుకోవడంపై ప్రభుత్వం మొదటి నుంచీ దృష్టి సారించక పోవడమే అందుకు కారణం.

ఆర్టీ పీసీఆర్ టెస్టింగ్ సామర్ధ్యాన్ని రోజుకు 15 వేల వరకు పెంచుతామని, యాంటీ జెన్ టెస్టింగ్ కిట్స్ వచ్చాక రెట్టింపు చేస్తామని ఈ నెల మొదటి వారంలో చెప్పారు. కానీ కొన్ని రోజులుగా రోజూ టెస్టులు సగటున 13 వేలకు మించడం లేదు. టెస్టింగ్ సామర్ధ్యం తక్కువగా ఉండటం, అనుమానితుల సంఖ్య పెరుగుతుండటంతో తీవ్ర ఇబ్బందులు వస్తున్నాయి. 

దేశంలో 85 శాతం పాజిటివ్ కేసులలో రోగాలక్షణాలు కనిపించడం లేదని ఒక వంక చెబుతుండగా ప్రభుత్వం ఈ విధంగా మొండికేయడం విచారం.   పైగా, శాంపిల్ తీసుకున్న మూడు నాలుగు రోజులకు రిజల్ట్ చెప్తుండటంతో, ఆలోపు బాధితుల ఆరోగ్యం విషమించడంతో పాటు కాంటాక్ట్ అయ్యేవారి సంఖ్యా పెరుగుతోంది.

రాష్ట్రంలో 10 లక్షల జనాభాకు సగటున 8,058 టెస్టులు చేశారు. ఇందులో దేశంలోని 14 రాష్ట్రాలు మనకంటే ముందున్నాయి. ఢిల్లీలో అత్యధికంగా ప్రతి 10 లక్షల జనాభాకు 45 వేలు, జమ్మూ కశ్మీర్ లో 40 వేలు, తమిళనాడు, ఏపీలో 26 వేల, హిమాచల్ ప్రదేశ్, హర్యానాలో 16 వేలు, కేరళ, పంజాబ్, కర్నాటకలో 15 వేల చొప్పున టెస్టులు చేశారు. ఉత్తరాఖండ్, చంఢీగడ్, చత్తీస్ గఢ్, గుజరాత్, ఒడిశా కూడా  తెలంగాణ కన్నా ముందే ఉన్నాయి.