ఉప ముఖ్యమంత్రిగా ధర్మాన కృష్ణదాస్‌  

నూతనంగా బాధ్యతలు చేపట్టిన మంత్రులకు శాఖలు కేటాయించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీచేశారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ధర్మాన కృష్ణదాస్‌కు రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌, స్టాంపులశాఖ, సీదిరి అప్పలరాజుకు పశు సంవర్థక, మత్స్యశాఖ, డెయిరీ డెవలప్‌మెంట్‌ శాఖలు అప్పగించారు. 

ఇప్పటి వరకూ ధర్మాన కృష్ణదాస్‌ నిర్వహించిన రోడ్లు భవనాల శాఖను మాలగుండ్ల శంకరనారాయణకు, శంకరనారాయణ నిర్వహించిన బిసి సంక్షేమ శాఖను చెల్లుబోయిన శ్రీనివాస గోపాలకృష్ణకు కేటాయించారు.  

జగన్‌ ఆశయాలకు అనుగుణంగా నీతి, నిజాయితీతో పారదర్శకంగా పాలన చేస్తానని కృష్ణ దాస్ తెలిపారు. బిసిలకు అన్ని విధాలా సముచితస్థానం కల్పించారని త్తెలిపారు. నూతనంగా వచ్చిన నాలుగు రాజ్యసభస్థానాల్లో రెండు, మంత్రివర్గంలో ఖాళీ అయినా రెండు స్థానాలనూ బిసిలకే కేటాయించారని కొనియాడారు.

కాగా, రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్న పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, మత్య్స, పశు సంవర్ధక, మార్కెటింగ్ శాఖ మంత్రిగా ఉన్న మోపిదేవి వెంకటరమణ ఇటీవల రాజ్యసభకు ఎన్నిక కావడంతో.. వారు తమ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.