అమెరికాతో కలసి భారత్ నావికా విన్యాసాలు

సరిహద్దుల్లో దూకుడుగా ప్రవర్తిస్తున్న హెచ్చరిక సంకేతాలు పంపే విధంగా త్వరలో అమెరికాతో కలిసి అండమాన్, నికోబార్‌ దీవుల్లో నావికా విన్యాసాలు నిర్వహించ‌డానికి భారత్ సిద్ధ‌మ‌య్యింది. ఇటీవల కాలంలో  సరిహ‌ద్దుల్లో భార‌త సేన‌ల దూకుడు పెరిగింది.

చైనాకు సంబంధించి కేంద్ర ప్ర‌భుత్వంలో ప్రతీకార ధోరణి తెలుస్తున్న‌ది. ముఖ్యంగా గల్వాన్ ఘటన తర్వాత అంతర్జాతీయంగా చైనాకు వ్యతిరేకంగా ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టడంలో భారత్ చేసే అన్ని ప్రయత్నాలు ఫలిస్తున్నాయి.

ఏడాది చివ‌ర‌లో జ‌రుగ‌బోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారత్ మద్దతు కోసం ఎదురుచూస్తున్న డోనాల్డ్ ట్రంప్ కూడా భార‌త్‌తో సంయుక్త‌ నావికా విన్యాసాల‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో అమెరికాకు చెందిన యుద్ధనౌక యు ఎస్ ఎస్  నిమిట్జ్ భారత జలాల్లోకి ప్ర‌వేశించింది. 

అమెరికాకు చెందిన యుద్ధనౌక యు ఎస్ ఎస్  నిమిట్జ్‌తో కలిసి భార‌త యుద్ధ నౌక‌లు నేవ‌ల్ విన్యాసాల‌లో పాల్గొననున్నాయి. వాణిజ్య ప్రయోజనాల కోణంలో అమెరికాను మచ్చిక చేసుకుని తద్వారా భారత్‌ను ఇరుకునపెట్టాలని భావిస్తున్న చైనాకు ఈ నావికా విన్యాసాల ద్వారా భార‌త్ గ‌ట్టి షాక్ ఇచ్చిన‌ట్ల‌వుతుంది. 

దీంతో భార‌త్‌, అమెరికా నావికా విన్యాసాలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఈ విన్యాసాల ద్వారా త‌మ సైనిక సైనిక సామ‌ర్థ్యాల‌ను చైనాకు గుర్తుచేసిన‌ట్ల‌వుతుంద‌ని ఇరుదేశాలు భావిస్తున్నాయి. ఇరుదేశాల యుద్ధ నౌకలు అండమాన్ నికోబార్ దీవుల్లో నిర్వహించబోతున్న నావిగాక విన్యాసా‌ల‌కు పాసెక్స్ అనే పేరు పెట్టారు.

జూలై 22న నిర్వ‌హించనున్న ఈ విన్యాసాల కోసం అమెరికా యుద్దనౌక యు ఎస్ ఎస్  నిమిట్జ్ ఇప్ప‌టికే అండమాన్‌, నికోబార్ దీవుల‌కు చేరుకుంది. దాదాపు 1,00,000 ట‌న్నుల బ‌రువుండే ఈ నౌకకు 90 యుద్ధ విమానాల‌ను మోసుకెళ్ల‌గ‌ల సామ‌ర్థ్యం ఉన్న‌ది. ఈ విన్యాసాల్లో పాల్గొన‌డం కోసం మరో యుద్ధనౌక యు  ఎస్ ఎస్ రోనాల్డ్ రీగన్ కూడా ఇప్ప‌టికే భార‌త్‌కు బ‌య‌లుదేరింది.