కేసీర్ ప్రభుత్వంపై హై కోర్ట్ తీవ్ర ఆగ్రహం 

తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలు అమలు చేసేందుకు కేసీఆర్  ప్రభుత్వానికి ఇదే చివరి అవకాశమని తేల్చి చెపింది. తమ సహనాన్ని పరీక్షించవద్దని కోరింది. ఆదేశాలు అమలు కాకపోతే తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరించింది. 
 
కరోనాపై హెల్త్‌ బులిటెన్‌లో సమగ్ర వివరాలు ఉండాలని మరోసారి ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నెల 28న సీఎస్‌, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి కోర్టులో హాజరు కావాలని ఆదేశించింది. తెలంగాణ వ్యైద ఆరోగ్యశాఖ వెబ్‌సైట్‌ను పునరుద్దరించాలని ఆదేశాలు జారీచేసింది. 
 
 జిల్లాల వారీగా కరోనా కేసులను కలెక్టర్లు వెల్లడించాలని హైకోర్టు ఆదేశించింది. అలాగే ప్రైమరీ కాంటాక్టులకు జరిపిన పరీక్షల వివరాలను, ర్యాపిడ్‌ టెస్ట్‌ సెంటర్ల వివరాలను వెల్లడించాలని సూచించింది. పెళ్లిళ్లు అంత్యక్రియలకు ఎక్కువ మంది హాజరు కాకుండా చూడాలని ఆదేశాలు జారీచేసింది. ఫిర్యాదుల కోసం ఏర్పాటు చేసిన నంబర్‌కు విస్తృత ప్రచారం కల్పించాలని తెలిపింది. 
అంతకుముందు విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను గాలికి వదిలేసిందని హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది.  కోర్టు ఆదేశాలు పాటించని అధికారులపై చర్యలు ఎందుకు తీసుకోకూడదని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా న్యాయస్థానం ప్రశ్నించింది.
అధికారులపై కేసు పెట్టి సస్పెండ్‌‌ చేయాలని ఎందుకు ఆదేశించకూడదో తెలపాలని అడిగింది. పదేపదే ఆదేశిస్తున్నప్పటికీ ఒక్క తీర్పు కూడా అమలు కాకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.  అలాగే కరోనా పరీక్షలు, సమాచారం వెల్లడి తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలతో పోలిస్తే కరోనా పరీక్షల్లో తెలంగాణ ప్రభుత్వం వెనకబడి ఉందని తెలిపింది.
వైపు కేసులు పెరుగుతుంటే ప్రభుత్వం నిద్రపోతుందా అని మండిపడింది. కరోనాపై విడుదల చేస్తున్న హెల్త్‌ బులెటిన్‌లలో సమగ్ర వివరాలు ఇవ్వడం లేదని చెప్పింది. ఆస్పత్రుల వారీగా బెడ్లు, వెంటిలేటర్ల వివరాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించింది. అధికారులు ఉద్దేశపూర్వకంగానే వాస్తవాలు దాచిపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. 
 
సమాచారం తెలుసుకోవడం అనేది ప్రజల ప్రాథమిక హక్కు అని స్పష్టం చేసింది. మరోవైపు కరోనాపై విడుదల చేసిన బులెటిన్‌లో హైకోర్టు అభినందించిందని ఇవ్వడంపై కూడా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ వైపు మెట్టికాయలు వేస్తుంటే అభినందించినట్టు ఎలా చెప్తారని ప్రశ్నించింది.