క్రైస్తవ సంస్థల మతమార్పిడి విధానాలు -1

“మేము గమనిస్తున్న మతమార్పిడి కేసుల్లో ‘ప్రలోభం’ అనేది ప్రధాన కారణంగా కనిపిస్తోంది. దేశంలోని మిషనరీలు హిందువులను మతం మార్చడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానుకలు ఇవ్వటం, ఇతర అవసరమైన వస్తువులు ఇవ్వటం, ఉచిత విద్య మరియు సుఖవంతమైన జీవితం కల్పిస్తామంటూ హామీ ఇవ్వటం ద్వారా ఈ మతమార్పిళ్లు కొనసాగుతున్నాయి. వాళ్ళ ప్రధాన లక్ష్యం సామాజికంగా వివక్షకు గురి అవుతున్న షెడ్యూల్డ్ కులాలు, తెగల ప్రజలే. ఈ నాగరిక సమాజంలో ఏ వ్యక్తి లేదా సమూహం కూడా ప్రలోభాల కారణంగా మతమార్పిడి గురి కాకుండా చూడాలి.” 

— ఉత్తరప్రదేశ్ రాష్ట్ర న్యాయ కమిషన్ ప్రభుత్వానికి సమర్పించిన ఏడవ నివేదికలోని పేజీ నెంబర్ 250లో పొందుపరిచిన అక్షర సత్యాలు ఇవి.
కమిషన్ వ్యక్తపరిచిన ఈ అభిప్రాయం ప్రకారం దేశంలో జరుగుతున్న మతమార్పిళ్లకు ప్రధాన కారణం ‘ప్రలోభం’ అనేది స్పష్టమవుతోంది. ఇక్కడ మరో కారణం కూడా ఉంది.. అదే “మా దేవుణ్ణి నమ్మకపోతే నరకానికి పోతావు, అతని ఆగ్రహానికి గురవుతావు” (Divine Displeasure) అంటూ దేవుని పేరిట భయభ్రాంతులకు గురిచేయడం మరొక కారణం.
ఈ రెండు అంశాల ఆధారాంగా ప్రజలను మతమార్పిడి చేసేందుకు మిషనరీలకు కావాల్సింది ఆర్ధికపరమైన చేయూత. ఇందుకోసం ఫారిన్ కంట్రిబ్యూషన్ (రెగ్యులేషన్) చట్టంలోని లొసుగులను ఆసరాగా చేసుకుంటూ అమెరికా, యూరోప్ దేశాల నుండి భారీఎత్తున నిధులు సమకూర్చుకుంటున్నాయి.
మతమార్పిళ్ల ద్వారా భారత దేశ విచ్ఛిన్నానికి క్రైస్తవ మిషనరీలు ఏవిధమైన దారులు ఆశ్రయిస్తున్నారు అనేది వివరిస్తూ లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ సంస్థ యొక్క విశ్లేషణా విభాగం అందిస్తున్న వివరణాత్మక విశ్లేషణ ఇది.
‘దళితులపై అత్యాచారాలు’  పేరిట వసూళ్లు: 
దేశీయ మిషనరీ సంస్థలు విదేశీ ధన సేకరణ కోసం ‘దేశంలో దళితులపై అత్యాచారాలు’ అనే కధనాన్ని ప్రధానంగా ఎంచుకుంటున్నాయి. దీని కోసం వాళ్ళు ప్రధానంగా ఆధారపడేది “ఆర్యుల దండయాత్ర” సిద్ధాంతం. మిషనరీ వ్యవస్థకు చెందిన మేధో వర్గం ఈ “ఆర్యుల దండయాత్ర” సిద్ధాంతం నిజమని నమ్మించే క్రమంలో అదే పనిగా అనేక రూపాల్లో కల్పిత కధనాలు ప్రచారంలోకి తీసుకువస్తూ, ఈ సిద్ధాంతం ప్రజలలో సజీవంగా నిలిపేందుకు తీవ్రంగా కృషి చేస్తూ ఉంటారు.
3 శతాబ్దాల క్రితం క్రైస్తవ మిషనరీలు భారతదేశంలోకి అడుగుపెట్టిన సమయంలో,తమ మతమార్పిడిలో భాగంగా హిందూ ప్రార్ధనా మందిరాల వద్ద క్రైస్తవ ప్రచారాలు సాగించడం, హిందూ దేవీదేవతలను విమర్శిస్తూ వారిపై వ్యతిరేకత కలుగజేయడం వంటి పనులకు పాల్పడేవాళ్లు. అనంతరం విద్యాసంస్థలను ఏర్పాటు చేయడం ద్వారా విద్య అందించే నెపంతో మతమార్పిళ్లకు పాల్పడేవాళ్లు. ఈ ప్రణాళిక ద్వారా మిశ్రమ ఫలితాలు మాత్రమే రావడం మొదలయ్యాయి. దీంతో హిందూ సమాజాన్ని విడదీసి, ఒక వర్గాన్ని వివక్షకు గురైన వారిగా, మరోవర్గాన్ని వివక్షకు పాల్పడిన వారిగా చిత్రీకరిస్తూ “ఆర్య దండయాత్ర” సిద్ధాంతాన్ని సృష్టించి, విశేష ప్రాచుర్యం కల్పించారు. షెడ్యూల్డ్ కులాల ప్రజలను తాము సృష్టించిన “ఆర్య ద్రావిడ సిద్ధాంతం”లోని ద్రావిడులతో పోలుస్తూ సాగించిన మతమార్పిడి వ్యవహారం సత్ఫాలితాలు ఇవ్వసాగింది.
ఈ ఆర్య-ద్రావిడ సిద్ధాంతం ఆధారాంగా మతమార్పిళ్లకు మార్గం సుగమం చేసుకున్న క్రైస్తవ మిషనరీలు ఎస్సీ సామజిక వర్గంపై దాడులు జరుగుతున్నాయంటూ, వారిని ఉద్ధరించేందుకు తాము కృషి చేస్తున్నామంటూ విదేశాల నుండి ఆర్ధిక నిధులు వసూలు చేయడం మొదలుపెట్టాయి. నిధుల వసూలు కోసం ఇక్కడి నుండి విదేశాలకు వెళ్లే క్రైస్తవ మిషనరీ సంస్థల ప్రతినిధులు తాము చేసే ప్రసంగాల్లో అధికశాతం “ఎస్సీలపై దాడులు, వివక్ష, ఆర్యుల దండయాత్ర” అంశమే అధికంగా ఉంటుంది. ఈ క్రమంలో భారతదేశంలోని షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారు నరకయాతన అనుభవిస్తున్నట్టుగా విదేశీయుల్లో ఒక భ్రమ కలిగేలా చేస్తారు. ఈ సందర్భంలో షెడ్యూల్డ్ కులాలు, తేగల ప్రజల అభ్యున్నతికి భారత రాజ్యాంగం వారికి కల్పించిన హక్కులు, వారిపై జరిగే దాడుల నివారణ కోసం భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ఏర్పాటు చేసిన కఠిన చట్టాల గురించి ఏమాత్రం ప్రస్తావనకు రాకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు.
బాలల హక్కుల పరిరక్షణ పేరిట:
విదేశీ నిధులు సమకూరుచుకునేందుకు కొన్ని క్రైస్తవ స్వచ్ఛంద సంస్థలు ఎంచుకున్న మార్గం.. బాలల హక్కుల పరిరక్షణ. ఎక్కడెక్కడి నుండో చిన్నపిల్లలు, బాలకార్మికులకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సేకరించి, వాటిని చాలా జాగ్రత్తగా ఎడిట్ చేసి, వాటిని విదేశాల్లోని ఉన్న చందాదారులకు పంపిస్తారు. తద్వారా దేశంలో బాలలు అనేక కష్టనష్టలకు గురవుతున్నట్టుగా భ్రమ కల్పిస్తారు.
ఇటీవల ఒక మిషనరీ సంస్థ మండుటెండలో ఒక క్వారీలో కార్మికులుగా పనిచేస్తున్నట్టుగా కొందరు పిల్లలకు సంబంధించిన ఒక వీడియో రూపొందించి తమ వెబ్సైటు ద్వారా ప్రచారం చేయసాగింది. అందులో వాళ్ళు రాసిన సందేశం ఈ విధంగా సాగుతుంది.  “.. తమ సంస్థ ద్వారా 1300 మంది షెడ్యూల్డ్ కులాలకు చెందిన పిల్లలు బాలకార్మిక వ్యవస్థ నుండి రక్షింపబడ్డారు. మరో 500 మంది పిల్లలు రక్షణ కోసం ఎదురుచూస్తున్నారు”. కానీ అది ఏ రాష్ట్రం, ఏ ప్రాంతం, ఆ పిల్లలు ఎక్కడివారు అనే వివరాలేవీ అందులో ఉండవు. అంతమంది పిల్లలు అక్కడ బాలకార్మికులుగా పనిచేయడం అనేది వార్తల్లో ప్రధానంగా రావాల్సిన విషయం, కానీ ఏ వార్తాపత్రికల్లో కూడా ఇది కనిపించదు. అసలు బాలల హక్కుల పరిరక్షణ కోసం దేశంలో అనేక చట్టాలు ఉన్న విషయం కానీ, బాలకార్మిక వ్యవస్థపై కఠినంగా వ్యవహరించే జాతీయ బాలల హక్కుల కమిషన్, రాష్త్ర కమిషన్లు ఈ దేశంలో ఉన్న విషయం తమ విదేశీ చందాదారుల దృష్టికి రాకుండా ఇక్కడి మిషనరీలు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు.
మతమార్పిళ్ళ కోసం మానవ వనరులు, మౌళిక సదుపాయాల ఏర్పాటు:
వక్రీకరించి, వండివార్చిన అసత్యపు కధనాలు, సిద్ధాంతాల ప్రచారం ద్వారా విదేశాల నుండి భారీ ఎత్తున ధనం పొందే ఇక్కడి మతమార్పిడి సంస్థలు, తమ ప్రణాళికలో భాగంగా ఆ ధనంతో ఓ వ్యవస్థ ఏర్పాటు చేసుకుంటాయి. ఇందుకోసం పుట్టగొడుగుల్లా చర్చిల నిర్మాణం, పాస్టర్లకు ట్రైనింగ్ కళాశాలల ఏర్పాటు, క్రైస్తవ సాహిత్యం ముద్రించి ప్రచారం చేయడం వంటివి చేస్తుంటాయి. కృష్ణా జిల్లా రెడ్డిగూడెం మండలం మద్దులపర్వ గ్రామంలో క్రైస్తవులు, అక్కడి చర్చిల సంఖ్య గమనిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. అధికారికంగా క్రైస్తవులు లేని ఆ గ్రామంలో ప్రభుత్వ లెక్కల ప్రకారం 11 చర్చిలు ఉన్న విషయం సమాచార హక్కు చట్టం కింద వచ్చిన సమాధానం ప్రకారం బయటకు వచ్చింది.
దేశంలో లక్ష చర్చిల ఏర్పాటు లక్షంగా తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన క్రైస్తవ సంస్థ “సర్వ్ ఇండియా మినిస్ట్రీస్” సంస్థ 20 వేల మంది పాస్టర్లకు ఈ దిశగా శిక్షణనిచ్చినట్టు తమ వెబ్సైట్ ద్వారా ప్రకటించింది.
గుంటూరు జిల్లా చిలుకలూరిపేటకు చెందిన అడ్వాన్స్డ్ గొస్పెల్ మినిస్ట్రీస్ (AMG) సంస్థ ఏటా 1.78 కోట్ల నిధులు కేవలం ‘జాతీయ కార్మికుల’ జీతాల కోసం సమకూర్చుకుంటోంది. ఇక్కడ జాతీయ కార్మికులు అంటే తాము శిక్షణనిచ్చి మతప్రచారం కోసం పంపించే పాస్టర్లు అని అర్ధం.
సశేషం..
(లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ ప్రజల న్యాయపరమైన హక్కుల కోసం పోరాటం చేసున్న సంస్థ)