ఫడణ్‌వీస్ పై శివసేన ప్రశంసల వర్షం   

మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణ్‌వీస్ పై అధికారిక పక్షమైన శివసేన ప్రశంసల వర్షం కురిపించింది. ఏకంగా తన అధికారిక పత్రిక అయిన ‘సామ్నా’ లోనే ఆకాశానికెత్తడం గమనార్హం.  

‘ప్రతిపక్ష నేత’ పాత్రను ఆయన చాలా సమర్థవంతంగా పోషించారని మెచ్చుకుంది. కోవిడ్ పోరాటంలో ఆయన ప్రభుత్వం చేస్తున్న కృషిని మెచ్చుకున్నారని, ఆ మెచ్చుకోలు తనం తమకు నైతిక బలాన్నిచ్చిందని శివసేన హర్షం వ్యక్తం చేసింది.

‘‘దేవేంద్ర ఫడణ్‌వీస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ధైర్యంగా, క్రియాశీలకంగా వ్యవహరించారు. తనకు కోవిడ్ పాజిటివ్ వస్తే… కచ్చితంగా ప్రభుత్వ ఆసుపత్రిలోనే వైద్యం తీసుకుంటా అని ఓ మంత్రితో చెప్పారు. ఆయన చేసిన ప్రకటనకు ప్రశంసించాల్సింది పోయి… ట్రోల్ చేస్తున్నారు. అది ఏమాత్రం సరైన వైఖరి కాదు” అంటూ పేర్కొన్నారు. 

 ప్రతిపక్ష నేతగా ఆయన నూటికి నూరుపాళ్లూ విజయవంతం అయ్యారని పదే పదే చెబుతున్నామని శివసేన స్పష్టం చేసింది.  కరోనా పాజిటివ్ అని పరీక్షలో తేలితే ప్రభుత్వ ఆస్పత్రిలోనే వైద్యం చేయించుకుంటానన్న ఆయన వ్యాఖ్యలు రాజకీయ జిమ్మిక్కు ఎంత మాత్రమూ కాదని తేల్చింది. ప్రభుత్వ వ్యవస్థపై ఆయనకున్న విశ్వాసం అది అని శివసేన కొనియాడింది. 

మరోవంక ఢిల్లీలో హోమ్ మంత్రి అమిత్ షాను కలసిన అనంతరం మహారాష్ట్రలో ’ఆపరేషన్ కమల్’ అన్నది లేదని ఫడణ్‌వీస్ ప్రకటించారు. మహా వికాస్ అగాఢీలోనే అంతర్గత కుమ్ములాటలున్నాయని, ఈ కారణంగానే అది కుప్ప కూలుతుందని, అదీ చూస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు.