ముఖ్యమంత్రి పదవిపై పట్టు వీడని సచిన్ పైలట్ 

ఒక వంక తనకు సంఖ్యాబలం లేదని వెల్లడైన, మరోవంక తనపై అనర్హత వేటుకు రంగం సిద్దమవుతున్నా తాత్కాలికంగా రాజస్థాన్ హై కోర్ట్ నుండి కొంత గడువు పొందగలిగిన తిరుగుబాటు కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ ముఖ్యమంత్రి పదవిపై మాత్రం పట్టు వీడటం లేదు.

ఒక సంవత్సరంలోగా తనను ముఖ్యమంత్రిగా చేస్తామని బహిరంగంగా ప్రకటించడం ద్వారా కాంగ్రెస్ లో తనకు సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇస్తేనే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లను కలవడానికి సిద్ధమని స్పష్టం చేసిన్నట్లు తెలుస్తున్నది.

అయితే ముందుగా తన వర్గం ఎమ్యెల్యేలతో ఒక హోటల్ లో ఏర్పాటు చేసిన శిబిరాన్ని వదిలివేసి జైపూర్ వచ్చిన తర్వాతనే మాటలనే సంకేతం కాంగ్రెస్ ఇప్పటికే ఇచ్చింది. ఇప్పుడు బేషరతుగా సచిన్ ను ఏ విధంగా చర్చలకు వచ్చేటట్లు చేయాలా అని కాంగ్రెస్ అధిష్ఠానం సతమతమవుతున్నట్లు తెలుస్తున్నది.

స్పష్టమైన హామీ ఇచ్చే వరకు తాను భేటీ అయ్యేది లేదని తేల్చి చెప్పారని ప్రియాంక గాంధీకి సన్నిహితుల్లో ఒకరు చెప్పారు. ఉపముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించిన తర్వాత పైలెట్‌ ఈ డిమాండ్‌ తెరపైకి తెచ్చారని చెబుతున్నారు. రెండురోజుల క్రితం ప్రియాంక గాంధీ పైలెట్‌తో మాట్లాడరని, ఆయన చాలా ఓపికగా మాట్లాడరని చెప్పారు.

తనపై అనర్హత చర్యలు తీసుకొంటూ ఇప్పుడు మాట్లాడుతున్నారని, వాళ్లను ఎలా నమ్ముతానని పైలెట్‌ అన్నట్లు తెలుస్తోంది. 2018లో రాజస్థాన్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే పార్టీ విజయానికి తాను ఎంతో కృషి చేశానని, సీఎం పదవి తనకు ఇవ్వాలని సచిన్‌పైలెట్‌ డిమాండ్‌ చేశారు.

కానీ అశోక్‌ గెహ్లాట్‌ను సీఎంను చేసిన హైకమాండ్‌ సచిన్‌ పైలెట్‌కు ఉపముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టింది. కాగా.. మొదటి నుంచి దీనిపై అసంతృప్తితో ఉన్న పైలెట్‌ ఇటీవల తిరుగుబాటు చేశారు. తన మద్దతు దారులతో తిరుగుబాటు చేసి సీఎల్పీ సమావేశాలకు డుమ్మా కొట్టారు. ఈ నేపథ్యంలో పైలెట్‌, అతని వైపు ఎమ్మెల్యేలపై కాంగ్రెస్‌ పార్టీ వేటు వేసింది.