పోలీసుల చక్రబంధనంలో మావోయిస్టులు   

కరోనా మహమ్మారి కట్టడిలో ప్రభుత్వ యంత్రాంగం నిమగ్నమై ఉన్న సమయంలో వలస కూలీల రూపంలో ప్రవేశించిన మావోయిస్టులు పోలీసుల చక్రబంధనంలో చిక్కుకున్నట్లు తెలుస్తున్నది.  రెండు రోజుల క్రితం తిర్యాణి అటవీ ప్రాంతంలో పోలీసుల దాడి నుంచి త్రుటిలో తప్పించుకున్న మావోయిస్టులు తాజాగా బలగాల ఉచ్చులో చిక్కినట్లు తెలుస్తోంది. 

రాష్ట్ర డీజీపీ ఎం మహేందర్రెడ్డి శుక్రవారం స్వయంగా కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి వెళ్లి కూంబింగ్ ఆపరేషన్ ను పర్యవేక్షించడం అనుమానాలకు బలం చేకూరుతోంది. కరోనా లాక్డౌన్ టైంలో వలస కూలీల రూపంలో మావోయిస్టులు జిల్లాలోకి ప్రవేశించినట్లు పోలీసులు భావిస్తున్నారు.

మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్, అతని సహచరి కంతి లింగవ్వతో బాటు మరో ఏడెనిమిది మంది మావోయిస్టులు తిర్యాని అడువుల్లో తలదాచుకున్నట్లు  పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ ఆధ్వర్యంలో పోలీస్ బలగాలు ముమ్మరంగా కూంబింగ్ చేస్తున్నాయి.

ఈ క్రమంలో ఆరు రోజుల క్రిత౦ అడెల్లు దళం తలదాచుకున్న శిబిరంపై పోలీసులు దాడి జరపగా త్రుటిలో తప్పించుకున్నారని చెప్పిన పోలీసులు, ఆ క్యాంపు నుంచి కీలక డాక్యుమెంట్లు, ఆహార సామగ్రి, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు. మావోయిస్టులను ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోకుండా చూడాలని భావించిన పోలీసులు, వివిధ జిల్లాలు, హైదరాబాద్ నుంచి మరిన్ని ప్రత్యేక బలగాలను రప్పించి అడవులను చుట్టుముట్టారు.

మావోయిస్టులకు ఆశ్రయమిచ్చిన వ్యక్తిని ఇప్పటికే అదుపులోకి తీసుకుని అతడి నుంచి సమాచారం రాబట్టినట్లు భావిస్తున్నారు. ప్రస్తుతం మైలారపు అడెల్లు, అతని భార్య కంతి లింగవ్వతో బాటు మరికొంతమంది మావోయిస్టులు పోలీసు వలయంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ వ్యాప్తంగా మావోయిస్టుల కదలికల పై నిఘా పెట్టామని, తిర్యాణి అడవుల్లో ముమ్మరంగా కూంబింగ్ సాగుతోందని  మహేందర్ రెడ్డి ప్రకటించారు. 500 మంది స్పెషల్ పార్టీ, గ్రేహౌండ్స్ పోలీసులు గాలిస్తున్నారని, రెండుసార్లు తప్పించుకుపోయిన మావోయిస్టులను త్వరలోనే పట్టుకుని చట్టం ముందు ఉంచుతామని స్పష్టం చేశారు.

పదేళ్లుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రశాంతంగా ఉందని, అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని చెబుతూ నక్సలైట్ల సమస్య లేకపోవడంతో మారుమూల పల్లెల్లో రోడ్లు, తాగునీరు, ఇరిగేషన్ ప్రాజెక్టుల్లాంటి పనులు జరిగాయని, ఆదివాసీలకు అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందాయని వివరించారు.

బోధ్కు చెందిన మైలారపు ఆడెల్లు అలియాస్ భాస్కర్ నాయకత్వంలో ఐదుగురు సభ్యుల టీమ్ జిల్లాలో తిరుగుతుందన్న సమాచారం ఆదివాసీల్లో ఆందోళనను కలిగిస్తోందని, ఇప్పటివరకు అందిన సంక్షేమ పధకాలు  దూరమవుతాయన్న భయం వారిలో వ్యక్తమవుతోందని పేర్కొన్నారు. ప్రజలు, ఆదివాసీలు మావోయిస్టులకు ఎలాంటి సహాయాన్ని చేయవద్దని కోరారు. నక్సలైట్ల వల్ల అభివృద్ధి పూర్తిగా దెబ్బతింటుందని హెచ్చయిర్న్చారు.

మరోవంక, కరోనా కాలంలో తాము స్వీయ నియంత్రణ పాటిస్తూ భౌతిక దాడులకు దూరంగా ఉండగా, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తమ దళాలను నిర్మూలించే ప్రయత్నాలు చేస్తున్నాయని మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్‍ ఆరోపించారు. ఈనెల 15న భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని మల్లేపల్లితోగు, ఆసిఫాబాద్‍ జిల్లా తిర్యాణిలో జరిగిన దాడులను ఆయన ఖండించారు.

మణుగూరు మొదలు కొని ఆసిఫాబాద్‍ వరకు గ్రేహౌండ్స్, స్పెషల్‍ పార్టీ బలగాలతో కూంబింగ్‍ ఆపరేషన్లు చేస్తున్నారని పేర్కొన్నారు. ఆపరేషన్‍ ప్రహార్‍ పేరుతో ఆంధ్రా, తెలంగాణ, ఛత్తీస్‍గఢ్‍, మహారాష్ట్రలలో జాయింట్‍ ఆపరేషన్ నిర్వహిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గత జనవరి నుంచి జరిపిన దాడుల్లో సృజన, అభిలాష్‍ సహా 40 మంది చనిపోయారని తెలిపారు.