విజయవాడను కుదిపేస్తున్న డ్రగ్స్ కలకలం 

విజయవాడలో ఇటీవల కలకలం రేపిన డ్రగ్స్‌ కేసు కలకలం నగరాన్ని కుదిపేస్తున్నది.  నగరానికి చెందిన కోనేరు అర్జున్‌ ఈ వ్యవహారంలో కీలక వ్యక్తిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. డ్రగ్స్‌ ముఠాలో ఎవరెవరూ ఉన్నారు?ఎలా సరఫరా చేస్తున్నారు? వంటి విషయాలపై పోలీసులు ఆరాతీస్తున్నారు. 

గత వారం విజయవాడ నగర పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో డ్రగ్స్‌, గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో సూడాన్‌కు చెందిన మహమ్మద్‌ గహేల్‌ రసూల్‌ను, టాంజానియాకు చెందిన లిస్వా షబ్బినీ, పెనమలూరు మండలం కామయ్యతోపుకు చెందిన కోనేరు అర్జున్‌ను అరెస్టు చేశారు. 

గహేల్‌ రసూల్‌, లిస్వా షబ్బినీ విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలో ఉంటూ డ్రగ్స్‌ విక్రయాలకు పాల్పడుతున్నారు. వీరు బెంగుళూరు నుంచి మిథలైన్‌ డయాక్సీ మెథాంఫేటమిన్‌ కొనుగోలు చేసి విజయవాడలో విక్రయిస్తున్నారు.

వీరి నుంచి 17 గ్రాముల మిథలైన్‌ డయాక్సీ మెథాంఫేటమిన్‌, 150 గ్రాముల గంజాయి, బిట్‌కాయిన్స్‌, హుక్కా పరికరం, 3 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. విదేశీ నిందితుల పాస్‌పోర్టులు సీజ్‌ చేసినట్టు తెలిసింది.

ఈ డ్రగ్స్‌ వ్యవహారంలో కీలక సూత్రధారిగా ఉన్న కోనేరు అర్జున్‌ పెనమలూరు పిఎస్‌ పరిధిలోని ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో చదివినట్లు గుర్తించారు. డ్రగ్స్‌, గంజాయి కొనుగోళ్లు, అమ్మకాల్లో అర్జున్‌ కీలకంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అతనికి పరిచయం ఉన్న పాత విద్యార్థులందరినీ విచారించాలని పోలీసులు భావిస్తున్నారు.