భారత్ లో పెగట్రాన్‌ భారీ పెట్టుబడులు 

క‌రోనా కాలంలోనూ విదేశాల‌కు చెందిన‌ ప్ర‌ముఖ కంపెనీలు భార‌త్‌లో పెట్టుబ‌డులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయి. తాజాగా ప్రముఖ మొబైల్‌ దిగ్గజం యాపిల్ ఐఫోన్‌ను తయారుచేసే పెగట్రాన్‌ కంపెనీ దేశంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్దమైంది. 

తైవాన్‌కు చెందిన పెగట్రాన్‌​ కంపెనీ చెన్నైలో తయారీ పరిశ్రమను స్థాపించబోతున్నట్లు ఆ కంపెనీ వర్గాలు తెలిపాయి. కాగా యాపిల్ ఐఫోన్‌ల‌ను తయారుచేసే ప్రపంచ ప్రఖ్యాత తయారీ సంస్థలు విస్ట్రన్‌, ఫోక్సన్ ఇప్ప‌టికే దేశంలో తయారీని ప్రారంభించాయి. 

ఎక్కువగా పెగట్రాన్‌ కార్యాలయాలు, ఉద్యోగులు చైనాలో ఉండగా, ఆ కంపెనీ భార‌త్‌లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్దమవడం హర్షంచదగ్గ విషయమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

ఇదిలావుంటే పెగ‌ట్రాన్ కంపెనీ చైనాను కాదని భార‌త్‌కు ప్రాముఖ్యత ఇవ్వడం సంతోషకర ప‌రిణామ‌మ‌ని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం భారత్‌, చైనా సరిహద్దు వివాదాల నేపథ్యంలో పెగ‌ట్రాన్ కంపెనీ దేశంలో పెట్టుబడులు పెట్టడం శుభసూచికమని మార్కెట్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

కాగా, గత ఏడాది యాపిల్ కంపెనీ దేశంలో 150 కోట్ల  డాలర్ల బిజినెస్‌ చేసిందని ఆ సంస్థ వర్గాలు తెలిపాయి. గ‌త మార్చిలో పెగట్రాన్‌​ సీఈఓ లియా షీ గ్యాంగ్‌ స్పందిస్తూ.. క్లయింట్ల సూచనలు, ప్రభుత్వాల పాలసీల ఆధారంగా ఏ దశంలో పెట్టుబడులు పెట్టాలనే అంశాన్ని పరిశీలిస్తామని పేర్కొన్నారు.