చైనా కమ్యూనిస్టులకు నో ఎంట్రీ

చైనా కమ్యునిస్ట్ పార్టీ సభ్యులు తమ దేశంలోకి ప్రవేశించకుండా చర్యలు తీసుకునే పనిలో పడింది అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం. వారితో పాటు వారి కుటుంబాలకు కూడా అమెరికా ప్రవేశాన్ని నిషేధించాలన్న అంశం అమెరికా ప్రభుత్వం పరిశీలనలో ఉన్నది. 

ప్రస్తుతం చర్చలో ఉన్న ఈ ప్రాజెక్ట్ లో భాగంగా ప్రస్తుతం దేశంలో ఉన్న చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులతో పాటు వారి కుటుంబాల వీసాలను రద్దు చేయడానికి అమెరికా ప్రభుత్వం అనుమతించవచ్చు. దాంతో వారిని దేశం నుంచి బహిష్కరించేలా చేస్తుంది. చైనా మిలటరీ, ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థల కార్యనిర్వాహకుల ప్రయాణాన్ని పరిమితం చేయాలనే ప్రతిపాదనలు కూడా తయారయ్యాయి. 

హాంగ్ కాంగ్‌లో వేర్పాటువాద, విధ్వంసక, ఉగ్రవాద కార్యకలాపాలను నిషేధించిన చైనా ఇటీవల ఆమోదించిన భద్రతా చట్టం నేపథ్యంలో అమెరికా ఈ చర్యకు వచ్చినట్లు తెలుస్తున్నది. జూన్ 30 న చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఈ చట్టాన్ని అమలులోకి తెచ్చారు. హాంకాంగ్ ప్రతిపక్షాలు, పాశ్చాత్య అధికారులు చైనా విధానాలను తీవ్రంగా ఖండించారు.

ఈ చట్టం హాంకాంగ్ నివాసితుల హక్కులను ప్రభావితం చేయదని హాంకాంగ్ నాయకత్వంతోపాటు బీజింగ్‌లోని చైనా కేంద్ర ప్రభుత్వం రెండూ చెప్తున్నాయి. హాంకాంగ్‌లో ఇటీవల జరిగిన అశాంతి విదేశాల జోక్యం వల్ల జరిగిందని, “ఒక దేశం, రెండు వ్యవస్థలు” సూత్రాన్ని గౌరవిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నట్లు చైనా పేర్కొన్నది.

ఈ నేపథ్యంలో చైనా కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులకు, వారి కుటుంబాలకు అమెరికా ప్రవేశంపై నిషేధం విధించాలన్న చర్యలకు ట్రంప్ ప్రభుత్వం సూత్రప్రాయంగా అనుమతించినట్లు తెలుస్తున్నది.