భారత్ లో రూ 75వేల కోట్ల గూగుల్ పెట్టుబ‌డులు

భార‌తీయ స్టార్ట్ అప్స్‌లో సుమారు రూ 75 వేల కోట్లు పెట్టుబ‌డులు పెట్ట‌నున్న‌ట్లు గూగుల్ సీఈవో సుంద‌ర్ పిచాయ్ వెల్లడించాయిరు.  గూగుల్ ఆఫ్ ఇండియా కార్య‌క్ర‌మంలో భాగంగా భారీ పెట్టుబ‌డుల‌ను ప్ర‌క‌టించారు.  ప‌ది బిలియ‌న్ల డాల‌ర్ల నిధుల‌తో భార‌తీయ డిజిట‌ల్ ఆర్థిక వ్య‌వ‌స్థ బ‌లోపేతం కానున్న‌ట్లు సుంద‌ర్ పిచాయ్ త‌న ట్విట్ట‌ర్‌లో తెలిపారు.

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ చేప‌ట్టిన డిజిట‌ల్ ఇండియా కార్య‌క్ర‌మానికి మ‌ద్ద‌తు ఇవ్వ‌డం గ‌ర్వంగా ఉన్న‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. డిజిట‌ల్ ఇండియా విజ‌న్‌తో ప్ర‌ధాని మోదీ ప‌నిచేస్తున్న తీర ప‌ట్ల ఆయ‌న హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

గూగుల్ ఫర్ ఇండియాలో భాగంగా డిజిటైజేషన్‌ ఫండ్ రూపంలో ఈ పెట్టుబడులు ఉండనున్నట్లు తెలిపారు. భారత్‌లో పెట్టుబడులు పెడుతున్నందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందని పిచాయ్ వెల్లడించారు. ఈక్విటీ వాటాలలు, సంస్థల్లో భాగస్వామ్యం, పర్యావరణ హిత మౌలిక సదుపాయాల కల్పన తదితర కార్యకలాపాల్లో ఈ పెట్టుబడులు ఉండనున్నట్లు వివరించారు.

ఇందులో భాగంగా వైద్య విద్య, వ్యవసాయ రంగాల్లో ఏఐ, వ్యాపార అభివృద్ధి, భారత్‌లో ఎన్నడూ లేని సరికొత్త ప్రాడక్ట్‌ల ఉత్పత్తి, భారతీయ భాషలపై ముఖ్యంగా దృష్టి సారించినట్లు చెప్పారు. భవిష్యత్ టెక్నాలజీను భారత్‌ ముందుండి నడిపించాలనేదే తన కోరిక అని పిచాయ్ పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే భారత ప్రధాని నరేంద్ర మోదీతో వర్చువల్ మీటింగ్ అనంతరం పిచాయ్ ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.   ఇవాళ ఉద‌యం ప్ర‌ధాని మోదీ ఓ ట్వీట్ లో   సుంద‌ర్ పిచాయ్‌తో అర్థవంత‌మైన చ‌ర్చ‌లో పాల్గొన్న‌ట్లు వెల్ల‌డించారు.  ప‌లు ర‌కాల అంశాల‌పై పిచాయ్‌తో మాట్లాడిన‌ట్లు మోదీ తెలిపారు.

భార‌తీయ రైతులు, యువ‌త‌, పారిశ్రామిక వేత్త‌ల‌ను మార్చ‌డంలో టెక్నాల‌జీ పోషించే పాత్ర గురించి చ‌ర్చించిన‌ట్లు ప్ర‌ధాని మోదీ వెల్ల‌డించారు.

 పీఎమ్ కేర్స్ నిధికి రూ. 124 కోట్లు 

ఇలా ఉండగా,  కరోనా కట్టడి కోసం ప్రధాని మోదీ సారథ్యంలో ఏర్పాటైన పీఎమ్ కేర్స్ నిధికి గూగుల్ పే ద్వారా రూ. 124 కోట్ల నిధులు అందాయని గూగుల్ ఇండియా హెడ్ సంజయ్ గుప్తా తెలిపారు. దాదాపు 20 లక్షల లావాదేవీల ద్వారా ఈ మొత్తం పీఎమ్ కేర్స్‌కు చేరిందన్నారు. 

తొలిసారిగా ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తున్న గూగుల్ ఇండియా ఈవెంట్ 2020లో ఆయన ఈ వివరాలను వెల్లడించారు. వివిధ వర్గాలకు చెందిన వ్యక్తులు గూగుల్ పే ద్వారా పీఎమ్ కేర్స్ నిధికి విరాళాలు ఇచ్చారని తెలిపారు. పీఎమ్ కేర్స్‌కు గూగుల్ పే వంటి యూపీఐ యాప్‌ ద్వారా విరాళాలిచ్చే అవకాశం ఉన్న విషయం తెలిసిందే.