బలవంతంగా రైతుల భూములు తీసుకోవద్దు 

విద్యుత్‌ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసే సందర్భాలలో రైతుల అనుమతి లేకుండా బలవంతంగా భూములు తీసుకోవద్దని ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఎపిఇఆర్‌సి) ఛైర్మన్‌ జస్టిస్‌ సివి నాగార్జున రెడ్డి విద్యుత్‌ సంస్థలను ఆదేశించారు. రైతుల విషయంలో ఇఆర్‌సి సానుభూతితో వ్యవహరిస్తుందని స్పష్టం చేసారు. 
 
వారికి నష్టపరిహారం సకాలంలో చెల్లించేలా తగిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. విద్యుత్‌ మౌలిక సదుపాయాల కల్పన, రైతుల సమస్యలు, తదితర అంశాలపై సమీక్ష నిర్వహిస్తూ భూసేకరణ అంశాల్లో విద్యుత్‌ చట్టాం2003లోని నిబంధనలను తూచా తప్పకుండా పాటించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 
 
భూములు తీసుకోవాల్సినప్పుడు రైతులకు సరైన న్యాయం జరిగేలా జాగ్రత్త వహించాలని నాగార్జునరెడ్డి సూచించారు. నష్టపరిహారాలు చెల్లింపులో జాప్యాన్ని నివారించేందుకు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ వంటివి నిర్వహించాలని ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ నాగులపల్లికి సూచించారు.
 
రైతుల ఫిర్యాదులు, వారికి సకాలంలో నష్టపరిహారం చెల్లింపు వంటి అంశాలను మరింత వేగవంతంగా పరిష్కరించే యంత్రాంగాన్ని పటిష్టం చేయాలని చెప్పారు. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు విద్యుత్‌ సంస్థలు చేస్తున్న కృషిని మరింత విస్తరింపజేయాలని పేర్కొన్నారు. 
 
వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా, అత్యుతమ సేవలు అందించడం, సకాలంలో ఫిర్యాదులు పరిష్కరించడం వంటి అంశాల్లో విద్యుత్‌ సంస్థలు యథావిధిగా తమ కృషిని కొనసాగించాలని చెప్పారు.  వినియోగదారుల ఫిర్యాదుల వేదికలు (సిజిఆర్‌ఎఫ్‌), విద్యుత్‌ అంబుడ్స్‌మన్‌ ఇచ్చే తీర్పులకు డిస్కాంలు కట్టుబడి ఉండాలని తెలిపారు.
వినియోగదారుల సౌకర్యార్థం మండల స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు డిస్కాం కార్యాలయాలు, సబ్‌స్టేషన్లు తదితర విద్యుత్‌ కార్యాలయాల వద్ద ఫిర్యాదుల బాక్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వినియోగదారులు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలన్నారు.