2023 తర్వాత కేసీఆర్‌ కుటుంబం అడ్రస్ ‌చంచల్ గూడ

2023 తర్వాత కేసీఆర్‌ కుటుంబం అడ్రస్‌   చంచల్ గూడా జైలే అంటూ నిజామాబాదు బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన సంచలనం వాఖ్యలు టి ఆర్ ఎస్ లో పెను తుఫాన్ రేపాయి. దానితో ఆక్రోశంపై ఆయనపై ఆ పార్టీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. 

‘నాకు కొత్తగా ఓ  విషయం తెలిసింది. కెసీఆర్, కెటీఆర్, కవిత, సంతోష్ రావుల కోసం అక్కడ నాలుగు సూట్ రూములు. ఇవి కాకుండా ప్రత్యేకంగా ఓ 50 రూములతో చంచల్ గూడ జైలులో ప్రత్యేక సెల్ నిర్మించబోతున్నారు. దీనికి బడ్జెట్ శాంక్షన్ కూడా  చేశారు. 2023 తర్వాత మనం వీళ్ళెవరినైనా కలవాలంటే చంచల్ గూడ జైలర్ ను పట్టుకోవాల్సిందే’ అంటూ వరంగల్ పర్యటన సందర్భంగా ఎద్దేవా చేశారు. 

నూటికి నూరు శాతం వీళ్ల అడ్రస్ ఫాంహౌస్ కాదు..ప్రగతి భవన్ కాదు. చంచల్ గూడ జైలే అని స్పష్టం చేశారు.  అదే సమయంలో కేంద్రం ఇచ్చిన నిధులను తెలంగాణ సర్కారు దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. దానితో ఆగ్రహంతో  టీఆర్ఎస్ కార్యకర్తలు అరవింద్ వాహనంపై దాడి చేశారు. 

విలేకరుల సమావేశం ముగించుకుని వెళుతున్న సమయంలో అరవింద్ కు వ్యతిరేకంగానినాదాలు చేయటంతోపాటు..కాన్వాడ్ పై దాడి చేశారు. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు హంటర్‌ రోడ్‌లోని బీజేపీ వరంగల్‌ అర్బన్‌ జిల్లా కార్యాలయంపై ఒక్కసారిగా దాడికి దిగారు. ఎంపీ అర్వింద్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డు మీదకు దూసుకువచ్చారు.

అప్రమత్తమైన పోలీసులు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని సుబేదారి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.. టీఆర్‌ఎస్‌ కార్యకర్తల దాడితో అవాక్కయిన బీజేపీ శ్రేణులు కొద్ది సేపటి తర్వాత వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌ భాస్కర్‌ క్యాంప్‌ కార్యాలయం మీద దాడి చేసేందుకు ప్రయత్నం చేశాయి. దీంతో వారిని అడ్డుకునేందుకు పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. 

అడ్వకేట్స్‌ కాలనీ మీదుగా క్యాంప్‌ ఆఫీస్‌ వైపు వెళుతున్న కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు అక్కడే టీఆర్‌ఎ్‌సకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం అమరవీరుల స్తూపం వద్ద ఆందోళన చేసేందుకు సిద్ధమయ్యారు. పోలీసులు అడ్డుకోవడంతో బీజేపీ నేతలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. 

ఈ క్రమంలో బీజేపీ వరంగల్‌ అర్బన్‌ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయారు. పోలీసులు హుటాహుటిన ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఈ రెండు ఘటనలతో ఆదివారం వరంగల్‌ నగరంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. 

‘కేసీఆర్‌ మహ్మద్‌ అలీ జిన్నా లాంటి వాడు. అసదుద్దీన్‌ ఒవైసీని తన పెద్ద కొడుకులా చూసుకుంటూ ఆయన అడుగు జాడల్లో రాష్ట్రాన్ని నడుపుతున్నాడు. హిందువుల రక్షణ కోసం ప్రధాని మోదీ తెచ్చిన సీఏఏను వ్యతిరేకించి తన హిందుత్వ డొల్లతనాన్ని తెలియజేసుకున్నాడు’ అంటూ అంతకు ముందు మీడియా సమావేశంలో అరవింద్ నిప్పులు చెరిగారు. 

ప్రజల పుణ్యాన గద్దెనెక్కి ఫామ్‌ హౌస్‌లు, ప్రపంచ వ్యాప్తంగా ఆస్తులు సంపాదించాడు. ఎన్నికల హామీలను మరచిన కేసీఆర్‌ పార్టీని ప్రజలు బొంద పెడతారు. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో విఫలమైన కేసీఆర్‌, ప్రజల ప్రాణాలను గాలికి వదిలి ఫామ్‌ హౌస్‌కు పరిమితం అవుతున్నాడని మండిపడ్డారు.