ఢిల్లీ వ్యూహాన్ని దేశం అంతా అమలు పరచాలి 

కరోనా వైరస్ కట్టడికి దేశ రాజధాని ఢిల్లీలో అమలు పరుస్తున్న వ్యూహాన్ని దేశం అంతా అమలు పరచాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సూచించారు. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారిని సమర్థంగా కట్టడి చేసిన కేంద్రం, రాష్ట్రం, స్థానిక అధికారులను ప్రధాని  ప్రశంసించారు. ఇదే వ్యూహాన్ని ఎన్‌సీఆర్‌ (నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌) అంతటా అమలుచేయాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. 

దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో కరోనా పరిస్థితులపై ఆయన శనివారం సమీక్ష నిర్వహించారు. మహమ్మారిపై విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని, వైరస్‌ కట్టడి చర్యలను ఇలాగే కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రధాని నిర్దేశించారు. ఈ విషయంలో నిర్లక్ష్యానికి తావులేదని స్పష్టం చేశారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, బహిరంగ ప్రదేశాల్లో భౌతిక దూరం తప్పనిసరిగా అవలంబించాలని ప్రధాని సూచించారు. 

అత్యధిక పాజిటివ్‌ రేటు నమోదవుతున్న రాష్ట్రాలపై జాతీయ స్థాయిలో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని అధికారులను ఆదేశించారు. కరోనావ్యాప్తి అధికంగా ఉన్న ప్రాం తాలపై ప్రత్యేక దృష్టిసారించి, కంటైన్మెంట్‌ కార్యకలాపాలను పర్యవేక్షించాలని సూచించారు.

 అహ్మదాబాద్‌లో ఇంటి వద్దకే వెళ్లి వైద్య సేవలందించేందుకు ఏర్పాటుచేసిన ‘ధన్వంతరి రథ్‌’ వాహనాల గురించి ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇతర ప్రాంతాల్లోనూ వీటిని ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. 

మరోవంక దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ రోజురోజుకు ఉగ్రరూపం దాలుస్తున్నది. మహమ్మారి బారిన పడిన రోగుల కేసులు శనివారం జంట రికార్డులు నెలకొల్పాయి. 24 గంటల్లో నమోదైన కేసులు 27 వేలు దాటితే, దేశవ్యాప్తంగా రికార్డయిన మొత్తం కేసులు 8 లక్షల మార్కును దాటాయి. శుక్రవారం ఉదయం నుంచి శనివారం వరకు రికార్డు స్థాయిలో కొత్తగా 27,114 మందికి పాజిటివ్‌ అని తేలింది. 

అప్పటి వరకు 24 గంటల్లో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. వరుసగా 8వ రోజు 22 వేలకు పైగా కొత్త కేసులు రికార్డయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా నమోదైన  కేసుమొత్తంలు 8,20,916కు చేరాయి. కోలుకున్న రోగుల సంఖ్య 5,15,385కు చేరగా, 2,83,407 మంది చికిత్స పొందుతున్నారు. దీంతో కోలుకున్న రోగుల శాతం 62.78కి చేరింది. తాజాగా 519 మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 22,123కు చేరింది.

వంద నుంచి లక్ష మందికి వైరస్‌ సోకడానికి 64 రోజుల సమయం పడితే, తర్వాత 15 రోజుల్లో జూన్‌ 3న రెండు లక్షల మార్క్‌ను దాటాయి. అటుపై మరో 10 రోజుల్లో 3 లక్షలకు, తర్వాత 8 రోజులకు జూన్‌ 21న పాజిటివ్‌ కేసులు నాలుగు లక్షలు దాటాయి. ఆరు రోజులకు జూన్‌ 27న వైరస్‌ సోకిన రోగుల సంఖ్య ఐదు లక్షలకు, ఈ నెల 7న (పది రోజులకు) ఏడు లక్షల మార్క్‌ను దాటింది.

ఏడు లక్షల మార్క్‌ను దాటిన 4 రోజుల్లోనే మహమ్మారి బారిన మరో లక్ష మంది పడ్డారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. వైరస్‌ ప్రభావం మొదలైనప్పటి నుంచి లక్ష కేసులు నమోదు కావడానికి 110 రోజులు పడితే, 53 రోజుల్లోనే ఏడు లక్షల కేసులు నమోదయ్యాయి.