కర్ణాటకలో 10 రోజుల పాటు లాక్ డౌన్ 

కర్ణాటకలో తాజాగా ఈ నెల 14 నుండి 10 రోజుల పాటు మళ్ళి ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. వరుసగా మూడో రోజూ 2వేలకు మించి కరోనా కేసులు నమోదవడంతో పాటు మరణాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది.  కరోనా కట్టడి కోసం జూలై 14 నుంచి  22 వరకు పూర్తిస్థాయిలో లాక్‌డౌన్‌ అమలు చేయనున్నారు.  
 
పెరుగుతున్న కోవిడ్ -19 కేసులను దృష్టిలో ఉంచుకుని జూలై 14న రాత్రి 8 గంటల నుంచి జూలై 23 ఉదయం 5 గంటల వరకు బెంగళూరు పట్టణ, గ్రామీణ జిల్లాల్లో పూర్తిగా లాక్ డౌన్ అమల్లో ఉంటుందని కర్ణాటక ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. నిత్యావసర సేవలకు మినహాయింపు ఉంటుందని సీఎంవో పేర్కొంది.
 
 కరోనా కట్టడి చర్యల్లో భాగంగా లాక్ డౌన్ నిబంధనలను కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా అమలు చేస్తోంది. అయినప్పటికీ రోజురోజుకూ కర్ణాటక రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  
 
ఇలా ఉండగా, కరోనా మహమ్మారిని అదుపు చేసేందుందుకు బెంగళూరు నగరంలో శనివారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం ఉదయం 5గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుందని నగర పోలీస్‌ కమిషనర్‌ భాస్కర్‌రావు తెలిపారు. కారణం లేకుండా బయటకు వచ్చే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 
 
శుక్రవారం కర్ణాటకలో 2,313 కొత్త కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. కర్ణాటకలో మొత్తం 33,418 కొవిడ్‌-19 ధ్రువీకరించారని పేర్కొన్నారు. వీటిలో 19,039 యాక్టివ్‌ కేసులున్నాయి. మరో 543 మంది కరోనా ప్రభావంతో మృతి చెందారు.
 
గత కొద్ది రోజులుగా కొత్తగా నమోదవుతున్న కేసుల్లో సగం కేసులు బెంగళూర్‌ నగరంలోనే ఉంటున్నాయి. శనివారం  బెంగళూర్‌ నగరంలో 1533 కొత్త కేసులు నమోదవయ్యాయి. మొత్తం కేసులు సంఖ్య 16,862కు చేరుకుంగా, మరణాల సంఖ్య 229కి చేరుకుంది.