ధారావిలో కరోనా కట్టడిపై డబ్ల్యూహెచ్‌ఓ ప్రశంస

 
ఆసియాలోనే అతిపెద్ద మురికివాడల్లో ఒకటైన ముంబైలోని ధారావిలో కరోనా వ్యాప్తిని నిలువరించడాన్ని ప్రంపచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రశంసించింది. ధారావీలో కరోనా కట్టడికి చేసిన ప్రయత్నాల కారణంగా ప్రస్తుతం ఆ ప్రాంతం ఈ ప్రాణాంతక వైరస్‌ నుంచి బయపడే దశలో ఉందని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అథనామ్‌ గెబ్రెయెసిస్‌ పేర్కొన్నారు. 
 
సంఘీభావంతో మాత్రమే ఈ మహమ్మారిని నివారించవచ్చని తెలిపారు. జూన్‌ నెలలో ధారవి కరోనా హాట్‌స్పాట్‌గా ఉన్నది. కానీ జూలైన నెలలో కేసులు పూర్తిగా తగ్గిపోయాయి.  కరోనా వ్యాప్తి చాలా తీవ్రంగా ఉన్నప్పటికీ, దాన్ని తిరిగి నియంత్రణలోకి తీసుకురాగలమని ప్రపంచవ్యాప్తంగా అనేక ఉదాహరణలు ఉన్నాయని, ఇటలీ, స్పెయిన్‌, దక్షిణ కొరియా, ధారావీలు దీనికి నిదర్శణమని తెలిపారు.
కరోనా పరీక్షలు అధికంగా నిర్వహించడం, సామాజిక దూరం పాటించడం, వ్యాధి సోకిన వారికి తక్షణమే చికిత్స అందిస్తున్న కారణంగా కరోనా యుద్ధంలో ధారావి విజయం సాధించిందని వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా గత ఆరువారాల్లో కరోనా కేసులు రెట్టింపు అయ్యాయని చెప్పారు. వీటిని ప్రజల భాగస్వామ్యంతో అరికట్టవచ్చని పేర్కొన్నారు.
 
ధారావిలో జూన్‌ నెలలో సరాసరి రోజుకు 18 చొప్పున కరోనా కేసులు నమోదయ్యాయి. జూన్‌ 1న అత్యధికంగా 34 కేసులు నిర్ధారణ అయ్యాయి. అయితే జూలై వచ్చేనాటికి కరోనా కేసులు క్రమంగా తగ్గిపోయాయి. జూలై 8న మూడు కేసులు నమోదవగా, జూలై 9న తొమ్మిది, నిన్న పదకొండు నమోదయ్యాయి. ఈ మురికివాడలో ఇప్పటివరకు 2359 పాజిటివ్‌ కేసులు నమోదవగా, అందులో 166 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.