నిజాం కు పట్టిన గ‌తే మీకూ రావొచ్చు

తెలంగాణ సచివాలయం కూల్చివేత సందర్భంగా అక్కడున్న అమ్మవారి గుడిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు కూల్చివేశార‌ని బిజెపి ఎమ్యెల్యే రాజాసింగ్ ప్ర‌శ్నించారు. 

“ఆ గుడిని ముఖ్యమంత్రి కేసీఆర్ కట్టలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కట్టలేదు, టిడిపి ప్రభుత్వం కట్టలేదు.. నిజాం కాలం నాటి గుడి అని స్థానికులు  చెబుతున్నారు. గుడి మీకు ఎందుకు అడ్డం వచ్చింది? ఎందుకు డ్యామేజ్ చేశారు? “అని ఎమ్మెల్యే ప్ర‌శ్నించారు.

“గుళ్ళు పడగొట్టొద్దనీ, గుళ్ళు కూల్చి వేస్తే మనం సర్వ నాశనం అవుతామని పెద్దలు, మన పూర్వీకులు చెప్పేవారు. ఆ గుడి స్థానంలోనే మళ్లీ గుడి కట్టించండి.. లేదంటే నిజాం కు పట్టిన పరిస్థితే మీకూ రావొచ్చు. ఆలోచన చేసుకోండి” అని హెచ్చరించారు. 

కాగా, సచివాలయం కూల్చివేతలో మతపరమైన ప్రదేశాలకు నష్టం వాటిల్లడంపై సీఎం కేసీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు.   పాత భవనాల స్థానంలో కొత్తవి నిర్మించడమే ప్రభుత్వ ఉద్దేశ్యం తప్ప ప్రార్థనా మందిరాలకు ఇబ్బంది కలిగించడం ప్రభుత్వ ఉద్దేశం కాదని స్పష్టం చేసారు. 

ఇది కాకతాళీయంగా జరిగిన సంఘటన. దీన్ని అందరూ సహృదయంతో అర్థం చేసుకోవాలని కోరారు. ఇప్పుడున్న దానికన్నా ఎక్కువ విస్తీర్ణంలో, విశాలంగా ఖర్చుకు వెనుకాడకుండా దేవాలయం, మసీదులను నిర్మిస్తామని హామీ ఇచ్చారు.