సచివాలయం కూల్చివేత పనులకు బ్రేక్ 

తెలంగాణ సచివాలయం కూల్చివేత పనులకు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం బ్రేక్ వేసింది. సోమవారం వరకు పనులు నిలిపివేయాలని తాజాగా ఆదేశాలు జారీ చేసింది. నగరానికి చెందిన సామాజికవేత్త పీఎల్ విశ్వేశ్వర రావు వేసిన పిల్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం తాజా ఆదేశాలిచ్చింది. 
 
తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎలాంటి చర్యలు చేపట్టవద్దని తెలిపింది. ఇప్పటికే 60శాతం కూల్చివేసినట్టు సమాచారం. ప్రస్తుతం కోవిడ్ నిబంధనలు ఉల్లంగిస్తూ పాత సచివాలయంను కూల్చివేస్తున్నారంటూ విశ్వేశర్ రావ్ పిల్ దాఖలు చేశాడు. 
 
భవనాల కూల్చివేయడం వలన వాతావరణ కాలుష్యం అవుతుందని పిటీషనర్ తన పిల్ లోపేర్కొన్నారు. మున్సిపాలిటీ సాలీడ్ వేస్ట్ మేనేజిమెంట్ నిబంధనలను పట్టించుకోకుండా సచివాలయం కూల్చివేత చేపడుతున్నారని అభ్యంతరం తెలిపాడు. అయితే తమకు ఇంకా ఎలాంటి ఆదేశాలు అందలేదని, అప్పటి వరకు యథాతథంగా పనులు జరుగుతాయని సచివాలయ అధికారులు చెబుతున్నారు.
 
ఆదేశాలు అందాక తమ తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. వారం రోజుల క్రితమే కూల్చివేతలకు హైకోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన విషయం తెలిసిందే. గత మంగళవారం కూల్చివేత పనులు ప్రారంభించారు. నాలుగు రోజులుగా నిర్విరామంగా జరుగుతున్న పనులకు హైకోర్టు తాజా ఆదేశాలతో తాత్కాలికంగా బ్రేక్ పడినట్టైంది.