రాజీనామా బాటలో అజేయ కల్లాం, పివి రమేష్‌  

పదవీ విరమణ చేసిన తరువాత కూడా కీలక బాధ్యతలు నిర్వహిస్తూ, గత సంవత్సరకాలంగా వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కీలక అధికార కేంద్రాలుగా వ్యవహరిస్తున్న  అజేయకల్లాం, పి.వి రమేష్‌లను అకస్మాత్తుగా పక్కన పెట్టడం అధికార వర్గాలలో పెను దుమారం రేపుతున్నది. 

దీంతో మనస్థాపానికి గురైన ఆ ఇద్దరు తమ పదవులకు రాజీనామా చేయాలి అనుకొంటున్నట్లు తెలుస్తున్నది. ఇక ఈ ప్రభుత్వంతో పనిచేయలేమని నిర్ణయానికి వచ్చిన్నట్లు చెబుతున్నారు.  నిజానికి గత ఆరు నెలలుగా కల్లాం, రమేష్‌ల ప్రాథాన్యం ముఖ్యమంత్రి కార్యాలయంలో తగ్గుతూ వస్తున్నది. 

కొన్ని సందర్భాల్లో వారు తెచ్చిన ఫైళ్లను చూడటానికి ముఖ్యమంత్రి నిరాకరిస్తున్నారని, మరో సీనియర్‌ అధికారి ప్రవీణ్‌ ప్రకాశ్‌కు చూపించాలంటున్నారని  చెబుతున్నారు. ప్రవీణ్‌ ప్రకాశ్‌ ముఖ్యమంత్రి పేషీతోపాటు, సాధారణ పరిపాలన శాఖలో ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు తీసుకోవడంతోనే ఈ మార్పులు ప్రారంభమయ్యాయని అంటున్నారు. 

తాజాగా కల్లాం, రమేష్‌ల శాఖలను ఇతర అధికారులకు బదిలీచేస్తూ జారీ అయిన ఉత్తర్వులు కూడా ఆయన సంతకంతోనే జారీ అయ్యాయి. ప్రస్తుతం కల్లాం, రమేష్‌ చేతుల్లో ఒక్క శాఖ కూడా లేదు. ఈ నేపథ్యంలో సిఎం పేషీలో ఇంకా కొనసాగడం మంచిదికాదన్న అభిప్రాయానికి వారిద్దరు వచ్చినట్లు తెలిసింది. 

ఇటీవల రాష్ట్ర విద్యుత్‌ రంగంపై కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్‌ చేసిన విమర్శలకు అజేయకల్లాం సమాధానమిచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ‘ఉద్యోగ విరమణ చేసిన బ్యూరోక్రాట్‌ కేంద్రమంత్రికి సమాధానమిస్తారా..?’ అంటూ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో తాజా పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం.