వైరస్‌ రోజువారీ వృద్దిలో మొదటిస్థానంలో భారత్ 

అత్యధిక కరోనా కేసుల సంఖ్యలో భారతదేశం అమెరికా, బ్రెజిల్‌ తర్వాత మూడో స్థానంలో ఉన్నప్పటికీ వైరస్‌ రోజువారీ వృద్ధి రేటులో మాత్రం అమెరికాను దాటి మొదటి స్థానంలో ఉంది. ఇది దేశంలో ఆందోళనకర పరిస్థితిని సూచిస్తుంది.
 
గత వారం రోజుల్లో అమెరికాలో రోజువారీ వైరస్‌ వృద్ధి రేటు 1.8 శాతం ఉండగా, బ్రెజిల్‌లో 2.7 శాతం, రష్యాలో 1 శాతం ఉంది. అదే భారత్‌లో 3.5 శాతంగా రోజువారీ వృద్ది రేటు నమోదైంది. ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో ప్రతి రాష్ట్రంలోనూ కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. 
 
గత 24 గంటల్లో వెయ్యికిపైగా కేసులు నమోదైన రాష్ట్రాల సంఖ్య 7కు చేరింది. రెండెంకల్లో మరణాలు సంభవించిన రాష్ట్రాల సంఖ్య ఎనిమిదికి పెరిగింది. కేరళలో ఎన్నడూ లేనంతగా 272 కేసులు వచ్చాయి. రోజుకు 250 కేసులు నమోదయ్యే రాజస్థాన్‌లో ఒక్కరోజులోనే 716 కేసులు వచ్చాయి.  
 
కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం తెలిపిన వివరాల ప్రకారం గత 24 గంటల్లో భారత్‌లో 24,879 మందికి కొత్తగా కరోనా సోకింది. అదే సమయంలో 487 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 7,67,296కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 21,129కి పెరిగింది. 
 
2,69,789 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 4,76,378 మంది కోలుకున్నారు. నిన్నటి వరకు దేశంలో మొత్తం 1,07,40,832 శాంపిళ్లను పరీక్షించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసిఎంఆర్‌) తెలిపింది. నిన్న ఒక్కరోజులో 2,67,061 శాంపిళ్లను పరీక్షించినట్లు వివరించింది.  
 
జార్ఖండ్ రాష్ట్ర మంత్రితోపాటు జార్ఖండ్ ముక్తిమోర్చా ఎమ్మెల్యేకు కరోనా సోకడంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ హోంక్వారంటైన్‌లోకి వెళ్లారు. జార్ఖండ్ మంత్రి మిథిలేష్ ఠాకూర్, జార్ఖండ్ ముక్తిమోర్చా ఎమ్మెల్యే మధుర మహతో లకు కరోనా పాజిటివ్ అని తేలింది.  
 
 చెన్నైలో ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామితో పాటు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్న ఓ మంత్రికి పాజిటివ్‌ లక్షణాలు ఉన్నట్టు వైద్య పరీక్షలలో నిర్ధారణ అయ్యింది. దీనితో ముఖ్యమంత్రి ఎడప్పాడి మరోమారు కరోనా పరీక్షలు చేయించుకోవడానికి సిద్ధమవుతున్నారు
 

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,21,66,668 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. 5,52,046 మంది మృతి చెందగా.. కరోనా బారినపడి చికిత్స పొంది 70,64,772 మంది కోలుకున్నారు.