బెంగాల్ లో పరాకాష్టకు నేరగ్రస్థ రాజకీయాలు

పశ్చిమ బెంగాల్ లో నేరస్థ రాజకీయాలు పరాకాష్టకు చేరుకున్నాయని బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా ధ్వజమెత్తారు. అక్కడ కరోనా కేసుల కంటే నేరగ్రస్థ రాజకీయాలు, అవినీతి ఎన్నడూ లేనంతగా పెరిగిపోయాయని ఎద్దేవా చేశారు.

భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన వర్చువల్ ర్యాలీలో నడ్డా సోమవారం మాట్లాడుతూ,  బెంగాల్‌లో కట్ మనీ (ప్రభుత్వ పథకాల పేరు చెప్పి మామూళ్లు వసూలు చేయడం) గురించి ఇప్పుడు అందరూ వింటున్నారని దుయ్యబట్టారు.

కట్ మనీ అడిగే నాయకుల తోకలు కత్తిరించాలని, బెంగాల్ గౌరవాన్ని నిలబెట్టాల్సిన అవసరం మనపై ఉందని పిలుపిచ్చారు. ఇందుకోసం సర్వశక్తులూ ఒడ్డాలని నడ్డా పార్టీ కార్యకర్తలకు సూచించారు.

కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే 370వ అధికరణను మోదీ, ఆయన ప్రభుత్వం రద్దు చేసిన తరుణంలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి జరుపుకోవడం ముదావహమని పేర్కొన్నారు. 370వ అధికరణ కింద జమ్మూకశ్మీర్‌కు ఎందుకు ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వాలని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ప్రశ్నించారని, అయితే నెహ్రూ, షేక్ అబ్దుల్లా మైండ్‌ పాలిటిక్స్‌‌ వల్లే నెహ్రూ స్వయం ప్రతిపత్తికి అంగీకరించారని విమర్శించారు.

ఒక వైపు ఐక్య భారతం కోసం శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోరాడితే, మరోవైపు ఏం చేసైనా సరే నా అధికారం నిలుపుకోవాలని బెంగాల్‌లో టీఎంసీ ప్రభుత్వం తహతహలాడుతోందని నడ్డా మండిపడ్డారు. సహకార సమాఖ్యపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రికి నమ్మకం లేదని విచారం వ్యక్తం చేశారు.

కేంద్రంతో కోవిడ్ డాటా పంచుకునే విషయంలోనూ ఆమె ఆసక్తి చూపలేదని ఆయన ఆరోపించారు. శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ దేశానికి చేసిన సేవలు, ప్రయత్నాల వల్లే పశ్చిమబెంగాల్‌, పంజాబ్‌లోని చాలా ప్రాంతాలు నేడు భారత్‌తో ఉన్నాయని నడ్డా పేర్కొన్నారు.