నిమ్స్ లో 7 నుంచి వ్యాక్సిన్ ట్రయల్స్

నిమ్స్‌లో కరోనా వాక్సిన్ ట్రయల్స్ ఈ నెల 7 నుండి మొదటి దశ క్లినికల్స్‌ను ప్రారంభిస్తామని డైరెక్టర్ డా. మనోహార్ తెలిపారు. ఫేజ్ 1లో భాగంగా మొదట 30 నుంచి 60 మంది ఆరోగ్యవంతుల మీద ప్రయోగిస్తామని వెల్లడించారు. ఇప్పటికే హాస్పిటల్స్ కు సంబంధించిన సామర్ధ్య పత్రాలను ఐసిఎంఆర్ పరిశీలించి బడ్జెట్‌ను కూడా విడుదల చేసిందని పేర్కొన్నారు. 

ఈ క్లినికల్స్ ట్రయల్స్‌లో భాగంగా ఆరోగ్యవంతులైన వ్యక్తులను ముందుగా స్క్రీనింగ్ చేసి, తర్వాత రక్తనమునాలు, స్వాబ్‌ను సేకరించి ఐసిఎంఆర్ ఢిల్లీ ల్యాబరేటరీలకు పంపుతామని తెలిపారు. అక్కడ్నుంచి రిపోర్టు వచ్చిన తర్వాత డిఫార్ట్‌మెంట్ ఆఫ్ మెడిసిన్ విభాగం ఫిట్‌నెస్ సర్టిఫికెట్‌ను ఇస్తేనే వ్యాక్సిన్‌ను ప్రయోగిస్తామని డా మనోహర్ తెలిపారు.

అయితే వ్యాక్సిన్ 3 రకాలుగా 3, 6 మైక్రోగ్రాములు, మరొకటి ప్లాసిగోగ్రామ్‌గా ఉంటుందని చెప్పారు. వీటిని సదరు వ్యక్తుల మీద డోస్‌ల వారిగా ప్రయోగిస్తూ వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తామని పేర్కొన్నారు. ఫేజ్ 1, ఫేజ్ 2 కింద నిమ్స్ ఆసుపత్రిలో ఈ క్లినికల్స్ జరుగుతాయని తెలిపారు.

మొదటి ఫేస్ 28 రోజులు ఉంటుందని, వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత సదరు వ్యక్తులకు 2 రోజులు అసుపత్రిలో అడ్మిట్ చేసి ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తామని తెలిపారు. భారత్ బయోటెక్ రూపొందించిన కో వాగిజిన్ క్లినికల్స్‌ను విజయవంతంగా నిర్వహిస్తామని భరోసా వ్యక్తం చేశారు. నిమ్స్ ఆసుపత్రికి గత 20 సంవత్సరాలు నుంచి కూడా ఫేజ్ 1 ట్రయల్స్ నిర్వహించిన అనుభవం ఉందని చెప్పారు. 

ఇప్పటికే ట్రయల్స్ నిర్వహించేందుకు ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌ను సిద్ధం చేశామని చెబుతూ ప్రపంచంలో మొదటి సారిగా ఈ వైరస్ పైన అధ్యయనం ఇక్కడ  జరగబోతుందని పేర్కొన్నారు. వాక్సిన్ ఇచ్చే వాలంటీర్లకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుంటేనే వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందని స్పష్టం చేశారు. 

దీనిపై డాక్టర్ల ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేశామని, వీరు వ్యాక్సిన్ ప్రయోగించిన వాలంటీర్లను 14రోజుల పాటు టెలీకాన్ఫరెన్స్ ద్వారా పరిశీలిస్తారని తెలిపారు. మరోవైపు వాలంటీర్లుగా వచ్చేందుకు ఇప్పటికే వందల సంఖ్య మెయిల్స్, ఫోన్లు కూడా వస్తున్నాయని వివరించారు.