చైనా దుశ్చర్య పట్ల సర్వత్రా ఆగ్రవేశాలు   

గల్వాన్‌ లోయలో దుశ్చర్యకు పాల్పడి 20 మంది జవాన్ల మరణానికి కారణమైన చైనాపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. చైనా వైఖరిని విమర్శిస్తూ పలు దేశాలు భారత్‌కు మద్దతును తెలుపుతున్నాయి. డ్రాగన్‌ దుర్బుద్ధిని పసిగట్టి భారత్‌కు బాసటగా నిలుస్తున్నాయి. 
 
కరోనా వైరస్‌ పుట్టుకకు కారణమై ఇప్పటికే ప్రపంచమంతటా డ్రాగన్‌పై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు హాంగ్‌కాంగ్‌ను రాజకీయంగా హస్తగతం చేసుకొనేందుకు చైనా చేస్తున్న ప్రయత్నాలకు ఇంటా బయట వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. 
 
దురాక్రమణ పర్వానికి పాల్పడుతూ సామ్రాజ్యవాద విస్తరణ కాంక్షతో విర్రవీగుతున్న డ్రాగన్‌ దేశ చర్యలను జపాన్‌తో పాటు అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, ఆస్ట్రేలియా, ఆగ్నేయాసియా దేశాలు ఎండగట్టాయి. దౌత్యపరంగా చైనాను ఏకాకిని చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నాయి. 
 
భారత్‌-చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలపై జపాన్‌ భారత్‌కు మద్దతు ప్రకటిస్తూ చైనా వైఖరిని తప్పుబట్టింది. తూర్పు లఢక్‌లో సరిహద్దులను మార్చే ఎలాంటి ఏకపక్ష చర్యలనైనా తాము వ్యతిరేకిస్తామని విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్‌తో జరిగిన సమావేశంలో జపాన్‌ రాయబారి సతోషి సుజుకీ  స్పష్టం చేశారు.
 
‘సరిహద్దుల్లో సాధారణ పరిస్థితులను తీసుకురావడానికి భారత్‌ చేస్తున్న ప్రయత్నాలను అభినందిస్తున్నాం’ అని పేర్కొన్నారు. అయితే భారత్‌కు జపాన్‌ మద్దతునివ్వడాన్ని చైనా జీర్ణించుకోవడం లేదు. ఈక్రమంలో జపాన్‌ ప్రాదేశిక జలాల్లోకి , చైనా తన రెండు గస్తీ నౌకలను మోహరించింది. 
ఇదిలాఉండగా.. కరోనా వల్ల వాయిదా పడ్డ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ పర్యటన తేదీని మళ్లీ ప్రకటించడానికి జపాన్‌ అంతగా  సుముఖత వ్యక్తం చేయడం లేదు. 
 
భారత సరిహద్దుల్లో చైనా కొనసాగిస్తున్న దురాక్రమణల పర్వం ఆ దేశ  అసలు స్వరూపాన్ని బట్టబయలు చేస్తున్నదని అమెరికా పేర్కొంది. ఇతర దేశాలపై కూడా డ్రాగన్‌ దేశం వైఖరి ఇలాగే ఉన్నదని ఆరోపించింది. చైనా యాప్‌లపై భారత్‌ విధించిన నిషేధం సరైనదేనన్నది. 
 
మరోవైపు, దక్షిణ చైనా సముద్రంపై తన ఆధిపత్యాన్ని నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్న చైనాకు అమెరికా చెక్‌ పెట్టింది. ఇందులోభాగంగా తన నౌకాదళానికి  చెందిన రెండు ఎయిర్‌క్రాఫ్ట్‌ క్యారియర్లను, మరో నాలుగు వార్‌ షిప్‌లను అక్కడ మోహరించింది.  
 
భారత సైనికులపై జరిగిన దాడి యావత్‌ భారతదేశంపై జరిగిన దాడిగా ఫ్రాన్స్‌ అభివర్ణించింది. చైనా సాగిస్తున్న కుట్రపూరిత చర్యలను తిప్పికొట్టేందుకు భారత్‌కు అండగా ఉంటామన్నది. భారత్‌ అభ్యర్థనమేరకు వీలైనంత త్వరగా రాఫెల్‌ యుద్ధ విమానాల్ని అందించి తగిన సాయం చేస్తామన్నది.
 
సామరస్యకపూర్వక వాతావరణంలో జరిగే చర్చలే వివాదాల్ని పరిష్కరిస్తాయని, భారత్‌-చైనా ఈ దిశగా ప్రయత్నాలు చేయాలని బ్రిటన్‌ పేర్కొంది. హాంకాంగ్‌ తదితర అంశాల్లో చైనా దుందుడుకు చర్యలు సరైనవి కాదని, ఘర్షణలతో సమస్యలు పరిష్కారం కావని పరోక్షంగా భారత్‌కు మద్దతు ప్రకటించింది.
 
భారత్‌-చైనా సరిహద్దుల్లో చైనా కారణంగానే ప్రతిష్ఠంభన నెలకొన్నదని ఆగ్నేయాసియా దేశాల అసోసియేషన్‌ (ఎఎస్‌ఈఏఎన్‌) ఆరోపించింది. మరోవైపు, కరోనా పుట్టుకకు గల కారణాలు ఏమిటన్న దానిపై నిష్పక్షపాత విచారణ జరుగాలని చైనాపై పరోక్షంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన ఆస్ట్రేలియా లఢక్‌ ఘటనపై భారత్‌ పక్షాన నిలిచింది. 
 
ఎల్‌ఏసీ వద్ద ఉద్రిక్తలను తగ్గించడానికి ఇరు దేశాలు చేస్తున్న కృషిని ప్రశంసిస్తున్నామని రష్యా పేర్కొంది.  కాగా, భారత్‌పై చైనా దురాక్రమణను నిరసిస్తూ అమెరికాలో ఆందోళనలు ఉద్ధృతమవుతున్నాయి. చైనా ఉత్పత్తులను నిషేధిస్తూ, ఆ దేశంతో దౌత్య సంబంధాలను తెంచుకోవాలని డిమాండ్‌ చేస్తూ అమెరికాలోని ప్రవాస భారతీయులు నిరసనలు చేపట్టారు. 
 
న్యూయార్క్‌లోని ప్రఖ్యాత టైమ్‌స్కేర్‌ భవనం దగ్గర చైనాకు వ్యతిరేకంగా ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ పెద్ద సంఖ్యలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ‘భారత్ మాతా కి జై’ అంటూ నినాదాలు చేశారు. ఇదే సమయంలో.. చైనాను ఆర్థికంగా బహిష్కరించాలని డిమాండ్ చేశారు. 
 
న్యూయార్క్, న్యూజెర్సీలో నివసిస్తున్న భారతీయులు, ‘కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్’ (ఎఫ్ఐఏ) అధికారులు ‘బాయ్‌కాట్‌ చైనా మేడ్ గూడ్స్’, ‘భారత్ మాతా కి జై’, ‘చైనీస్ దూకుడు ఆపాలి’ వంటి నినాదాలు చేశారు. కరోనా వైరస్ గ్లోబల్ ఎపిడెమిక్ నేపథ్యంలో ముఖాలకు మాస్కులు ధరించి నిరసనకారులు ప్రదర్శనలో పాల్గొన్నారు. 
 
“అమరవీరులైన భారత సైనికులకు వందనం” అనే ప్ల కార్డులు ప్రదర్శించారు. ఈ ప్రదర్శనలో టిబెట్ తైవాన్‌ దేశాలకు చెందిన ప్రజలు కూడా పాల్గొన్నారు. ‘టిబెట్ స్టాండ్ విత్ ఇండియా’, ‘చైనీస్ వస్తువులను బహిష్కరించండి’ అనే పోస్టర్‌లను ప్రదర్శించారు.  
 
“నేటి భారతదేశం 1962 భారతదేశానికి భిన్నంగా ఉంది. చైనా దురాక్రమణను, దాని బెదిరింపులను ఇక సహించం. చైనా అహంకారానికి తగిన సమాధానం ఇస్తాం” అని జైపూర్ ఫుట్ యూఎస్ఏ అధ్యక్షుడు భండారి స్పష్టం చేశారు.