రాజకీయ సంక్షోభంలో నేపాల్ ప్రధాని కేపీ శర్మ

చైనాతో చేతులు కలిపి భారత్ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న నేపాల్ ప్రధాని కెపి శర్మ రాజకీయ సంక్షోభంలో చిక్కుకున్నారు.  ప్రధానమంత్రి పీఠం నుంచి వైదొలగాలని కేపీ శర్మ ఒలిపై ఒత్తిడి పెరుగుతున్నది. 
 
షీతల్ నివాస్‌లో అధ్యక్షుడు బిద్యాదేవి భండారితో ఒలి భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నారన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. గురువారం మంత్రివర్గ సమావేశం జరగడానికి ముందు మంగళవారం కేపీ శర్మ ఓలీ ప్రెసిడెంట్ బిద్యా దేవితో రెండుసార్లు సమావేశమయ్యారు. 
పార్లమెంటును రద్దు చేయరాదని,   ప్రస్తుత సమావేశాలను ప్రోరోగ్ చేయాలని  చేసిన సిఫార్సులను అధ్యక్షుడు అధ్యక్షుడు బిద్యా దేవి ఆమోదించడంతో ఒకవిధంగా ఊపిరి పీల్చుకొని అవకాశం ఏర్పడింది. తన సొంత పార్టీలోనే పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం ఎదుర్కొనవలసిన అవసరం తప్పిపోయింది.
బలూవతార్‌లోని ప్రధాని కేపీ శర్మ ఒలి ప్రభుత్వ నివాసంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో పార్లమెంటు బడ్జెట్ సమావేశాన్ని వాయిదా వేసే నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు, బలూవతార్‌లో నడుస్తున్న కమ్యూనిస్ట్ పార్టీ స్టాండింగ్ కమిటీ సమావేశానికి కేపీ శర్మ ఒలి హాజరుకాలేదు. ప్రధాని కేపీ శర్మ ఒలి, మాజీ ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండల మధ్య వివాదం పెరుగుతూనే ఉంది. 
 
ప్రధాని పదవికి ఒలి రాజీనామా చేయాలంటూ నేపాల్ కమ్యూనిస్టు పార్టీ గత కొంతకాలంగా చెప్తూ వస్తున్నది. భారత్ కు వ్యతిరేకంగా ఓలి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సరైనవి కావని,  అదే సమయంలో దౌత్య పరంగానూ సరుబావు జైడా కాదని పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగుతున్నాయి. పార్టీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో పుష్ప్ కమల్ దహల్ ప్రచండ, మాధవ్ నేపాల్, జైనాథ్ ఖనాల్, బామ్‌దేవ్ గౌతమ్‌ సహా సీనియర్ నాయకులు ఒలి రాజీనామా చేయాల్సిందేనని పట్టుపట్టారు.
ఖాట్మండు మీడియా కథనం ప్రకారం, నేపాల్ అధికార పార్టీ నేపాల్ కమ్యూనిస్టు పార్టీ (ఎన్‌సీపీ) స్టాండింగ్ కమిటీలోని 44 మంది సభ్యుల్లో 31 మంది కేపీ శర్మ ఓలీకి వ్యతిరేకంగా ఉన్నారు. వీరు ఆ పార్టీ కో చైర్మన్  పుష్ప కమల్ దహల్ ‘ప్రచండ’కు మద్దతుగా మాట్లాడుతున్నారు. బుధవారం జరిగిన పార్టీ సమావేశంలో ఓలీ ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేయాలని వీరంతా డిమాండ్ చేశారు. 

ఈ నేపథ్యంలో పార్లమెంటును ప్రోరోగ్ చేయడం వల్ల ఓలీకి తక్షణమే బల పరీక్షను ఎదుర్కొనవలసిన అవసరం తప్పుతుంది. రాజకీయ పార్టీలో చీలికను గుర్తించేందుకు అవసరమైన నిబంధనలను సడలిస్తూ ఆర్డినెన్స్ జారీ చేయడానికి వీలవుతుంది. 

మరోవంక, ఛాతీ నొప్పి రావడంతో ప్రధాని కేపీ శర్మ ఒలిని ఖాట్మండులోని గంగలాల్ నేషనల్ హార్ట్ సెంటర్‌లో చేర్చారు. సాధారణ ఆరోగ్య పరీక్షల్లో భాగంగానే ప్రధాని దవాఖానకు వెళ్లారని ఒలి మీడియా సలహాదారు సూర్య థాపా తెలిపారు. మార్చి నెల చివరలో ఒలి హార్ట్‌ బీట్‌ రేటు పెరిగినప్పుడు త్రిభువన్ యూనివర్శిటీ టీచింగ్ హాస్పిటల్‌లో చేరారు. ఇదే నెలలో ఒలికి కిడ్నీ మార్పిడి కూడా జరిగింది.