కేసీఆర్ రాజకీయాలకు త్వరలో ముగింపు 

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రాజకీయ, అధికార కార్యకలాపాలకు త్వరలో ముగింపు తప్పదని బీజేపీ జాతీ య ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ స్పష్టం చేశారు. అధికార దుర్వినియోగానికి, అవినీతికి పాల్పడుతూ ప్రజల పట్ల అత్యంత నిర్లక్ష్యంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 

బుధవారం సాయంత్రం  జన్‌సంవాద్‌ ప్రాంతీయ వర్చువల్‌ ర్యాలీలో ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం జిల్లాపార్టీ నాయకులనుద్దేశించి ప్రసంగిస్తూ ఒక ప్రభుత్వం ఎలా ఉండకూడదు అన్నదానికి ఉదాహరణ కేసీఆర్‌ సర్కారేనని ధ్వజమెత్తారు. 

 ‘ఫెడరల్‌ ఫ్రంట్‌ కోసం కేసీఆర్‌ ప్రయత్నించారు. ఫ్రంటూ లేదు.. టెంటూ లేదు.. హైదరాబాద్‌లో ఆయన ఇప్పుడు ఒంటరిగా, ఏకాకిగా కూర్చున్నారు’ అని ఎద్దేవా చేశారు. ‘సగం సగం పూర్తయిన కాళేశ్వరం ప్రాజెక్టు తప్ప, ఏడాది కాలంలో మీరు  సాధించిన ప్రాజెక్టు ఒక్కటైనా ఉందా? మీ ఏడాది పాలనపై ప్రోగ్రెస్‌ రిపోర్టు ఇచ్చే ధైర్యముందా?’ అని సీఎంకు సవాల్‌ విసిరారు.

అవినీతికి, అసమర్థతకు మారుపేరుగా తెలంగాణ ప్రభు త్వం మారిందని, చివరకు కరోనాపై పోరాటంలోనూ ఇవి ప్రధాన అడ్డంకిగా మారాయని ఆరోపించారు. ‘కరోనా కేసులపై తప్పుడు లెక్కలతో, మసిపూసి మారేడు చేసినంత మాత్రాన రాష్ట్ర అభివృద్ధి సాధ్యమా? మహా అయితే కేంద్ర బృందాలను మోసం చేయగలరు.. కానీ, కరోనా బారిన పడ్డ రాష్ట్ర ప్రజలను ఎంతకాలం మోసం చేయగలరు?’ అని విరుచుకుపడ్డారు. 

ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా కరోనా కట్టడి కోసం కృషి చేస్తుంటే తెలంగాణ మాత్రం అందుకు సహకరించడం లేదని రాంమాధవ్ దుయ్యబట్టారు. ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రాలు కరోనా విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవడంతో ఇప్పటికీ 20వేల లోపు కేసులు నమోదయితే అందులో 20 శాతం మాత్రమే ఉన్న తెలంగాణలో 15వేలకు పైగా కేసులు నమోదయ్యాయని, ఇందుకు ఇక్కడి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని విమర్శించారు. యూపీలో రోజుకు 20వేల పరీక్షలు చేస్తుంటే.. తెలంగాణలో 2 వేలు కూడా చేయట్లేదని దుయ్యబట్టారు.

తమకు ఆదాయం వచ్చినా రాకున్నా, పన్నుల వాటా కింద తెలంగాణకు సుమారు 20వేల కోట్లు ఇస్తామని కేంద్రం మాట ఇచ్చిందని గుర్తు చేసారు.  

చైనాలో పుట్టి ప్రపంచంపై దాడి చేసిన కరోనాను ఎదుర్కోవడంలో విజయం సాధించిన ప్రధాని నరేంద్ర మోదీకి చైనాను ఎదుర్కోవడం పెద్ద కష్టం కాదని స్పష్టం చేశారు. చైనా అంశంలో మాటిమాటికి ట్వీట్లు చేస్తోన్న కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీకి వచ్చే 10 సంవత్సరాల వరకు ట్వీట్లు పెట్టడానికే పరిమితం కాకతప్పదని ఎద్దేవా చేశారు.