1,015 మంది మహారాష్ట్ర పోలీసులకు కరోనా

కరోనా మహమ్మారి మహారాష్ట్రలో కల్లోలం సృష్టిస్తున్నది. ఈ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. గడిచిన 24 గంటల్లో 77 మంది పోలీసులకు కరోనా సోకిందని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. 

ఇప్పటివరకు మహారాష్ట్రలో 1,015 మంది పోలీసులు కరోనా బారిన పడ్డారు. ఇందులో 60 మంది పోలీసులు చనిపోయారని అధికారులు వెల్లడించారు.  కరోనా కట్టడిలో ఫస్ట్ లైన్ వారియర్స్ గా పని చేస్తున్న పోలీసులు కరోనా బారిన పడుతుండడంతో పోలీసు ఉన్నతాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ప్రజలతో పాటు పోలీసులు కూడా భౌతిక దూరం పాటించాలని, విధిగా మాస్క్ లు ధరించాలని వారు సూచిస్తున్నారు. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రాష్ట్ర రాజధాని ముంబయిలో అధికంగా ఉండడంతో ముంబయి ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.

ఇలా ఉండగా, దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 18,563 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని, కరోనాతో మరో 507 మంది బాధితులు మరణించారని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్‌లో వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 5,85,493కు చేరింది. 

దేశంలో ఇప్పటివరకు కరోనా బారిన పడి 17,400 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలోని వివిధ ఆస్పత్రుల్లో 2,20,114 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 3,47,979 మంది కరోనా బాధితులు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.