టిక్‌టాక్‌ సహా 59 చైనా యాప్‌లపై నిషేధం  

చైనాకు భారత ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది. టిక్‌టాక్‌ సహా 59 యాప్‌లపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. భార‌త సార్వ‌భౌమ‌త్వం, స‌మ‌గ్ర‌త, దేశ ర‌క్ష‌ణ‌, శాంత్రి భ‌ద్ర‌తల‌‌కు ప్ర‌మాదంగా మారిన యాప్స్‌ను నిషేధిస్తున్నట్లు నోటిఫికేష‌న్ జారీ చేసింది.
 
 ఈ యాప్స్‌లో భార‌తీయులు చాలా ఎక్కువ‌గా వాడే టిక్‌టాక్‌, షేరిట్, హ‌లో, యూసీ బ్రౌజర్‌, బైడు మ్యాప్‌, ఎంఐ కమ్యూనిటీ,క్ల‌బ్ ఫ్యాక్ట‌రీ వంటి ప‌లు యాప్స్ ఉన్నాయి.షీ ఇన్, క్ల‌బ్ ఫ్యాక్ట‌రీ, హెలో, లైకి, బ్యూటీ ప్ల‌స్, విగో వీడియో, క్లీన్ మాస్ట‌ర్ , క్యామ్ స్కాన‌ర్, ఈఎస్ ఫైల్ ఎక్స్‌ప్లోర‌ల్‌, వీ మేట్, క్లాష్ ఆఫ్ కింగ్స్, ఎమ్ ఐ వీడియో కాల్‌, హాగో యాప్,  వివిధ ర‌కాల యాప్ లు నిషేధిత జాబితాలో ఉన్నాయి. 
 
భద్రతాపరమైన కారణాల దృష్ట్యా వీట న్నింటిపై నిషేధం విధిస్తున్నట్టు కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ శాఖ సోమవారం రాత్రి ప్రకటించింది. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్‌ 69ఏ, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ నిబంధనలు–2009ని అనుసరించి భద్రతాపరంగా పొంచి ఉన్న ముప్పు ఆధారంగా 59 యాప్‌లను నిషేధిస్తున్నట్టు తెలిపింది.
ఇవి దేశ సార్వభౌమాధికారం, సమగ్రత, దేశరక్షణ, ప్రజా భద్రతకు హాని కలిగించే కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్నట్టు సమాచారం ఉందని కేంద్రం స్పష్టం చేసింది. 130 కోట్ల మంది భారతీయుల గోప్యతను కాపాడాల్సి ఉందని అభిప్రాయపడింది.  

ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ ప్లాట్‌ఫామ్‌లలో లభ్యమయ్యే కొన్ని మొబైల్‌ యాప్‌లు భారతదేశం వెలుపల ఉన్న సర్వర్లకు మన దేశ వినియోగదారుల డేటాను అనధికారికంగా చేరవేస్తున్నట్లు, రహస్యంగా, దొంగతనంగా డేటాను పంపిస్తున్నట్టు ఐటీ శాఖకు అనేక ఫిర్యాదులు అందాయి.

ఇది చాలా ఆందోళన కలి గించే విషయమైనందున అత్యవసర చర్యలు చేపట్టినట్టు కేంద్రం వెల్లడించింది. ఈ హానికరమైన యాప్‌లను నిరోధించడానికి భారత సైబర్‌ క్రైమ్‌ కో–ఆర్డినేషన్‌ సెంటర్, హోం మంత్రిత్వ శాఖ కూడా సమగ్ర సిఫార్సులను పం పాయి.

డేటా సెక్యూరిటీ, గోప్యతకు సంబంధించి ప్రజల నుంచి ఫిర్యాదులు అందినట్టు ఐటీ శాఖ తెలిపింది. కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌కు కూడా డేటా భద్రత, గోప్యతలకు సంబం ధించి ఫిర్యాదులు అందాయి. దేశ సార్వభౌమత్వానికి, పౌరుల గోప్యతకు హాని కలిగించే మొబైల్‌ యాప్స్‌పై కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రజల నుంచి డిమాండ్లు వస్తున్నాయని కేంద్రం పేర్కొంది.

ఆయా యాప్‌లు వాణిజ్య ప్రకటనల ద్వారా భారత్‌లో రూ.వేల కోట్ల ఆదాయం ఆర్జిస్తున్నాయి. టిక్‌టాక్‌ మొత్తం వినియోగదారుల్లో 30 శాతం మంది మన దేశం నుంచే ఉన్నట్టు అంచనా. ప్రస్తుతం భారత ప్రభుత్వం తీసుకున్న చర్య వల్ల ఆయా కంపెనీల ఆదాయం గణనీయంగా పడిపోవడమే కాకుండా వాటి విలువ తగ్గుతుంది. చైనా యాప్‌ రెవెన్యూలో 2016 నుంచి ఏటా 140 శాతం వృద్ధిరేటు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

చైనా యాప్‌లపై నిషేధం విధించడంతో భారతీయ యాప్‌ మార్కెట్‌ విస్తరించే అవకాశం ఉంది. టిక్‌టాక్‌ వంటి యాప్‌లకు పోటీగా ఇప్పటికే చింగారీ వంటి స్వదేశీ యాప్‌ నిలదొక్కుకుంటోంది.

అలాగే న్యూస్‌డాగ్, హెలో వంటి న్యూస్‌ అగ్రిగేటర్లకు దీటైన స్వదేశీ యాప్స్‌ నిలదొక్కుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. చైనా దుందుడుకు చర్యలకు తగిన సమాధానంగానే యాప్‌లపై నిషేధం విధించినట్లు అవగతమవుతోంది.