ఈటెలపై కేసీఆర్ కోపం తెలంగాణకు శాపం 

సీఎం కేసీఆర్ కు ఆరోగ్య  మంత్రి ఈటల రాజేందర్ మీద ఉన్న కోపం ఇప్పుడు తెలంగాణ ప్రజలకు శాపమైందని బీజేపీ నేత, మాజీ మంత్రి  డీకే అరుణ ధ్వజమెత్తారు. కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, హైద‌రాబాద్ న‌గ‌రం క‌రోనా హ‌బ్‌గా మారింద‌ని ఆందోళన వ్యక్తం చేశారు.
 
కరోనా కట్టడి విషయం లో ఈటెల రాజేందర్ కు వాస్తవాలు తెలిసినా  ముఖ్యమంత్రిని ప్రశ్నించలేక పదవిని కాపాడుకునే పనిలో బీజేపీ పై విమర్శలు చేస్తూ కేసీఆర్ మెప్పు పొందే ప్రయత్నం చేసుకుంటున్నాడని అరుణ మండిపడ్డారు. 
 
రాష్ట్రంలో జిల్లా వైద్యాధికారులు చెబుతున్న లెక్కలకు, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెలువరిస్తున్న కరోనా కేసుల సంఖ్య విషయంలో భారీ తేడాలు ఎందుకు వుంటున్నాయో కేసీఆర్ సమాధానం చెప్పాలని ఆమె నిలదీసేరు. ఆరోగ్యశాఖ లో జరుగుతున్న విషయాలు కూడా తెలియని ఈటల రాజేందర్ నెంబర్ వన్ డమ్మీమంత్రిగా మారార‌ని విమ‌ర్శించారు.
కరోనా టెస్టులు చేసే ల్యాబ్స్ లల్లో సౌకర్యాలు పెంచక పోవడం వల్ల ,టెస్టుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నాటకాలు ఆడుతోందని ఆమె దయ్యబట్టారు. కేంద్ర బృందాలు రాష్ట్ర పర్యటన కు వచ్చిన సందర్భంలో,వారి మెప్పుకోసం చేసే హడావిడి, ఆత్రత ,ప్రజల ప్రాణాలు కాపాడడంలో కేసీఆర్  ప్రభుత్వానికి ఎందుకు లేదని ఆమె ప్ర‌శ్నించారు.

కేంద్ర ప్రభుత్వం కేటాయించిన కరోనా నిధులు రూ.7151 కోట్లు, సీఎం రిలీఫ్ ఫండ్ కు వచ్చిన విరాళాల నిధులు ఎక్కడెక్కడ ఎంతెంత ఖర్చుపెట్టారో చెప్పే నిజాయితీ కేసీఆసీర్ కు ఉందా? అని ఆమె నిలదీశారు. కరోనా నివారణకు వేయి కోట్ల నిధులు కేటాయిస్తానని చెప్పిన కేసీఆర్  ఇప్పటి వరకు పైసా కేటాయించలేదని ధ్వజమెత్తారు.

హరిత హారం పేరుతో ఊర్లు తిరుగుతున్న ముఖ్యమంత్రికి హైదరాబాద్ లోని ఆస్పత్రులను సందర్శించే భాద్యత లేదా అని అడిగారు. లక్షల్లో ఖర్చు అయ్యే కరోనా చికిత్స ఖర్చును,పేద మధ్యతరగతి ప్రజలు ఎలా భ‌రిస్తారని ప్ర‌శ్నించారు. ప్రభుత్వం టెస్టుల సంఖ్యను,పెంచి ప్రజల ప్రాణాలను కాపాడాలని ఆమె డిమాండ్ చేశారు.