సేవింగ్‌ బాండ్లు 2020 జారీ  

ప్రభుత్వ సెక్యూరిటీలో పెట్టుబడులకు అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో కేంద్రం తాజాగా వచ్చే నెల 1 నుంచి ఫ్లోటింగ్‌ రేటు ఆధారంగా సేవింగ్‌ బాండ్లు 2020ని జారీ చేస్తున్నట్లు ప్రకటించింది. పన్ను పరిధిలోకి రానున్న ఈనూతన స్కీంపై 7.75 శాతం వార్షిక వడ్డీని చెల్లించనున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 

ఏడేండ్ల కాలపరిమితి కలిగిన ఈ బాండ్లపై ప్రతియేటా జనవరి 1, జూలై 1న వడ్డీని చెల్లించనున్నది. అలాగే వచ్చే ఏడాది జనవరి 1న మాత్రం వడ్డీని 7.15 శాతం చెల్లించనున్నది. ఆదాయ పన్ను చట్టం 1961 ప్రకారం ఈ బాండ్లు పన్ను పరిధిలోకి రానున్నాయి. కేంద్ర ప్రభుత్వ సూచనలమేరకు రిజర్వుబ్యాంక్‌ ఈ బాండ్లను జారీ చేయనున్నది.   

ఇలా ఉండగా, దేశంలో కరోనా వైరస్‌ కేసులు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో బీమా రంగ రెగ్యులేటర్‌ ఐఆర్‌డీఏఐ కరోనా పాలసీలను తీసుకురావాలని బీమా కంపెనీలను ఆదేశించింది.

 వచ్చే నెల 10కల్లా స్వల్పకాలిక కొవిడ్‌ స్టాండర్డ్‌ ఆరోగ్య బీమా లేదా ‘కరోనా కవచ్‌ పాలసీ’ని తేవాలని జనరల్‌, ఆరోగ్య బీమా సంస్థలకు స్పష్టం చేసింది. మూడున్నర నెలలు, ఆరున్నర నెలలు, తొమ్మిదిన్నర నెలల్లో ఈ పాలసీలను అందుబాటులోకి తేవాలని ఐఆర్‌డీఏఐ తమ తాజా మార్గదర్శకాల్లో పేర్కొన్నది.

 కొవిడ్‌-19 స్టాండర్డ్‌ హెల్త్‌ పాలసీ శ్రేణి రూ.50 వేల నుంచి 5 లక్షల వరకు ఉండనున్నది.