కాపు రిజర్వేషన్లను తుంగలో తొక్కిన జగన్ 

గత ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడంతో జగన్‌ రెడ్డి పగ్గాలు చేపట్టి, అధికారంలోకి వచ్చిందే తడవుగా  కాపు రిజర్వేషన్లను తుంగలో తొక్కారని  జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌  మండిపడ్డారు.  ఇలాంటి కేటాయింపులు కోర్టులో నిలబడవని సెలవిచ్చారని ఎద్దేవా చేశారు. 

 కాపులకు ఇచ్చిన ఎన్నికల హామీని నిలబెట్టుకోవడానికి చంద్రబాబు ప్రభుత్వం ఈడబ్ల్యుఎస్‌ కోటాలో కాపులకు  5 శాతం రిజర్వేషన్లు ఇచ్చిందని పవన్ కళ్యాణ్ తెలిపారు. అసలు రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల వారికి రిజర్వేషన్లు అమలు చేయకుండా నిర్లక్ష్యం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. 

‘‘కాపులపై  ప్రేమతో 13 నెలల్లో 4,770 కోట్లను ఖర్చు చేశామని చెబుతున్న జగన్‌ రెడ్డి కాపులు కోరుతున్న రిజర్వేషన్లు ఎందుకు పునరుద్ధరించడంలేదు’’ అని పవన్‌ ప్రశ్నించారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీలకు నష్టం కలగకుండా గత ప్రభుత్వం కాపులకు ఇచ్చిన 5% రిజర్వేషన్లను తక్షణమే పునరుద్ధరించాలని పవన్ కుమార్ డిమాండ్ చేశారు. కాపులను ఓటు బ్యాంకు రాజకీయలకు వాడుకోవడం మానుకోవాలని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి  హితవు పలికారు. నిధులు ఇస్తున్నామంటూ సానుభూతి చూపించొద్దని స్పష్టం చేశారు. 

‘‘మమ్మల్ని ఎవరూ ఉద్ధరించనక్కరలేదు. మా ఆత్మాభిమానం దెబ్బతినేలా జాలి చూపనక్కరలేదు. మాకు గతంలో ఉన్న రిజర్వేషన్‌ని పునరుద్ధరించమనే అడుగుతున్నాం.. అని అంటున్న కాపులకు జగన్‌  ఏం సమాధానం చెబుతారు’’ అని ఆయన ప్రశ్నించారు. 

కాపుల స్థితిగతులను అంచనా వేయడానికి మంజునాథ కమిషన్‌ను చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసిందని,  కమిషన్‌ నివేదిక మేరకు కాపులను బీసీ జాబితాలోని ‘ఎఫ్‌‘ కేటగిరిలో చేర్చి 5ు రిజర్వేషన్లు కల్పిస్తూ శాసనసభ, మండలిలో బిల్లును ఆమోదించారని పేర్కొన్నారు. తదుపరి బిల్లును కేంద్రానికి పంపారని గుర్తు చేశారు. 

‘‘ఇది పార్లమెంటులో అనుమతి పొంది చట్టంగా మారడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. కేంద్రం దేశమంతటిని దృష్టిలో పెట్టుకునే ఆలోచన చేస్తుంది. దీంతో కాలాతీతం అయిపోయింది’’ అని చెప్పారు. మహారాష్ట్రలో మరాఠాలకు 16 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో తీర్మానం చేయగా, దీనిని 12 శాతానికి తగ్గించి ఆ రాష్ట్ర హైకోర్టు ఆమోదం తెలిపిందని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. 

అదేవిధంగా అప్పుడు చంద్రబాబుకు కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాలనే గట్టి సంకల్పం ఉండి ఉంటే మహారాష్ట్ర చేసిన విధంగానే చేసేవారని అంటూ టిడిపిపై విసుర్లు విసిరారు.