అహ్మద్‌ పటేల్‌ను ప్రశ్నిస్తున్న ఈడీ

సందేసర కుంభకోణంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్ కష్టాలు పెరుగుతున్నాయి. న్యూఢిల్లీలోని మదర్‌ థెరెసా క్రెసెంట్‌లోని ఆయన నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు చెందిన ముగ్గురు సభ్యుల బృందం ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయంలో ఆయన స్టేట్‌మెంట్‌ మాత్రమే తీసుకుంటున్నట్టుగా తెలిసింది. 

నితిన్ సందేసర, చేతన్ సందేసర, దీప్తి సందేసరలు రూ.14,500 కోట్ల  కుంభకోణానికి పాల్పడినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆరోపిస్తున్నది. దేశంలో నకిలీ కంపెనీలను సృష్టించడం ద్వారా సందేసర సోదరులు పలు భారత బ్యాంకుల నుంచి ఫోర్జరీ చేసి సుమారు రూ.14,500 కోట్లు రుణం తీసుకొన్నారు. ఈ వ్యక్తులపై 2017 లో సీబీఐ రూ.5,383 కోట్ల బ్యాంకు కుంభకోణంలో కేసు నమోదు చేసింది.

దీని తరువాత, ఈడీ కూడా వారిపై కేసు నమోదు చేసింది. సందేసర గ్రూపుకు చెందిన విదేశీ కంపెనీలు భారతీయ బ్యాంకుల విదేశీ శాఖల నుంచి రూ.9 వేల కోట్ల మేర రుణం తీసుకున్నట్లు దర్యాప్తులో తేలింది.

ఇలాఉండగా.. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ఇంటిని వదిలి బయటకు వెళ్లకూడదంటూ వైద్యులు తనకు సూచించారని చెప్పిన అహ్మద్ పటేల్ ఇప్పటికే రెండు సార్లు తనను ప్రశ్నించేందుకు పంపిన ఈడీ సమన్ల నుంచి తప్పంచుకొన్నారు. 

తమకు స్టెర్లింగ్ బైలాస్ లిమిటెడ్ డైరెక్టర్ నితిన్ సందేసర తమ్ముడు చేతన్ సందేసర తమకు తెలుసని అహ్మద్ పటేల్ కుమారుడు ఫైసల్ పటేల్,  అల్లుడు ఇర్ఫాన్ సిద్దిఖీ తెలిపినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ధ్రువీకరించింది. 

నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీల పిఎన్‌బి కుంభకోణం కంటే సందేసర కుంభకోణం పెద్దదని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గత ఏడాది పేర్కొనడం విశేషం. సందేసర కేసులో గత ఏడాది అహ్మద్ పటేల్ పేరు బయటపడింది. 

ఈడీ దర్యాప్తులో సాక్షులుగా అహ్మద్ పటేల్, ఆయన కుమారుడు ఫైసల్ పటేల్, అల్లుడు ఇర్ఫాన్ సిద్దిఖీ పేర్లు పెట్టారు. ఫైసల్ పటేల్, ఇర్ఫాన్ సిద్దిఖీ.. సందేసర నుంచి డబ్బు తీసుకున్నట్లు విచారణలో ఒప్పుకొన్నట్టు తెలిసింది.