ప్రశ్నలను దాటవేస్తున్న ఆచ్చెన్నాయుడు 

ప్రస్తుతం కోర్ట్ అనుమతితో ఎసిబి విచారణను ఎదుర్కొంటున్న టిడిపి సీనియర్ నేత కె ఆచ్చెన్నాయుడు వారి ప్రశ్నలకు చాలా వరకు తెలీదు… గుర్తు లేదు వంటి మాటలతో సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నట్లు తెలిసింది. 
 
ఇఎస్‌ఐ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడుని ఎసిబి అధికారులు గురు, శుక్రవారాలలో విచారణ సాగించగా, చివరి రోజుగా నేడు విచారణ చేయవలసి ఉంది. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ విచారించారు. 
 
విచారణ సమయంలో అచ్చెన్నాయుడుతోపాటు ఆయన తరుఫు న్యాయవాది ఎం.హరిబాబు, వైద్యుడిని అనుమతించారు. ఎసిబి డిఎస్‌పిలు ప్రసాద్‌, చిరంజీవి ఆధ్వర్యంలో విచారణ చేశారు. మంత్రిగా అచ్చెన్నాయుడు సిఫార్సు లేఖలపై వివరాలు సేకరించిన ఎసిబి అధికారులు మందులు, పరికరాల కొనుగోలులో ఆయన పాత్రను నిర్ధారించేలా ప్రశ్నించినట్టు తెలిసింది. 
 
ఇందుకు సమాధానంగా తెలిదు…గుర్తు లేదు అంటూ ఆచ్చెన్నాయుడు పలు ప్రశ్నలకు దాటవేసినట్టు తెలిసింది. అచ్చెన్నాయుడుపై వచ్చిన ఆరోపణలుపై గుచ్చిగుచ్చి ప్రశ్నించారు. వివిధ ప్రశ్నల ద్వారా ఇఎస్‌ఐ కుంభకోణం ఎలా జరిగిందో వివరాలు రాబట్టాలని ప్రయత్నించారని న్యాయవాది హరిబాబు చెప్పారు. 
 
మంత్రి ఇచ్చిన సిఫారస్‌ లేఖ పైనే శుక్రవారం విచారణ చేశారని తెలిపారు. కాగా, అచ్చెన్నాయుడు లేఖ కేవలం సలహా మాత్రమేనని, దానిని అధికారులు ఆమోదించాలని లేదని హరిబాబు చెబుతున్నారు. ఏదో విధంగా అచ్చెన్నాయుడును కేసులో ఇరికించాలనే ప్రయత్నం చేస్తున్నాని ఆరోపించారు.