లక్షణాలున్న ప్రతి ఒక్కరికి టెస్టులు చేయాల్సిందే 

దేశంలో లక్షణాలున్న ప్రతి ఒక్కరికీ టెస్టులు చేయాల్సిందేనని భారత వైద్య పరిశోధన మండలి  (ఐసీఎంఆర్) మరోసారి తేల్చి చెప్పింది. కరోనాను కట్టడి చేయాలన్నా, ప్రజల ప్రాణాలను కాపాడాలన్నా టెస్టులు చేయడం, కాంటాక్ట్లను గుర్తించడమే మార్గమని స్పష్టం చేసింది. టెస్టింగ్ను మరింత పటిష్టం చేయాలని, పెద్ద సంఖ్యలో టెస్టులు చేయాలని అన్ని రాష్ట్రాలకు సూచించింది.

ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు టెస్టుల సంఖ్యను పెంచేలా టెస్ట్ కిట్లు, మౌలిక వసతులను ఏర్పాటు చేసుకోవాలని పేర్కొంది.  ఐసీఎంఆర్ కొత్త రకం టెస్టులను అందుబాటులోకి తెచ్చింది. యాంటీజెన్ బేస్డ్ టెస్ట్లకూ ఐసీఎంఆర్ ఓకే చెప్పింది. ఆ టెస్టు కిట్లకు ఆమోదం తెలిపింది. ఈ టెస్ట్ కిట్లతో కేవలం పావుగంట నుంచి అరగంటలోపే రిజల్ట్ వస్తుంది.

దేశంలో ఇప్పటిదాకా ఆర్టీపీసీఆర్ కిట్లు, టీబీ టెస్టుల కోసం వాడే ట్రూనాట్, సీబీనాట్ పరికరాలతోనే టెస్టులు చేస్తున్నారు. తాజాగా యాంటీజెన్ కిట్లతో చేసే ర్యాపిడ్ పాయింట్ ఆఫ్ కేర్ (పీవోసీ) టెస్టులకూ ఐసీఎంఆర్ ఆమోదం తెలిపింది. గురుగ్రామ్లోని ఎస్డీ బయోసెన్సర్ అనే సంస్థ తయారు చేసిన స్టాండర్డ్క్యూ కొవిడ్19 ఏజీ కిట్కు ఓకే చెప్పింది. 

ఢిల్లీలోని ఎయిమ్స్, ఐసీఎంఆర్ సైంటిస్టులు టెస్టు కిట్లను పరీక్షించారని తెలిపింది. ఫలితాలను తెలుసుకునేందుకు ఎలాంటి ప్రత్యేక మెషీన్లు అవసరం లేదని, మామూలు కంటితోనే పసిగట్టొచ్చని పేర్కొంది. ఈ కిట్లతో పాజిటివ్గా తేలితే కరోనా కేసుగా లెక్కించొచ్చని, ఒకవేళ నెగెటివ్ వస్తే మళ్లీ ఆర్టీపీసీఆర్ (రియల్టైం) టెస్ట్ చేయాలని సూచించింది. ప్రపంచవ్యాప్తంగా యాంటీజెన్ కిట్లతో కచ్చితమైన ఫలితాలు వస్తున్నాయని చెప్పింది.

కాగా, కరోనాను గుర్తించేందుకు ఐజీజీ యాంటీబాడీ టెస్టును చేయొద్దని, దానిని కేవలం నిఘా కోసమే వాడాలని ఐసీఎంఆర్ సూచించింది. వైరస్ ఎంతమందికి సోకిందో తెలుసుకునే సీరో సర్వేల్లో దీనిని వాడొచ్చని చెప్పింది. లక్షణాల్లేని వాళ్లందరికీ చేయొచ్చని తెలిపింది.

వైరస్ ముప్పు ఎక్కువగా ఉండే హెల్త్కేర్ వర్కర్లు, ఫ్రంట్లైన్ వర్కర్లు, ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న వాళ్లకు, కంటెయిన్మెంట్ జోన్లలోని జనాలకు వీటితో టెస్టులు చేయొచ్చని పేర్కొంది. అందుకు ఎలీసా, సీఎల్ఐఏ కిట్లను వాడాలని సూచించింది.