మరింత చౌక కానున్న ఇంటర్నెట్   సేవలు 

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి పెరుగుతున్న ధోరణితో హై-స్పీడ్ ఇంటర్నెట్ కోసం డిమాండ్ పెరిగింది. ఫిక్స్‌డ్‌ బ్రాడ్‌బ్యాండ్ సేవలకు లైసెన్స్ ఫీజును తగ్గించాలనే ఆలోచనను కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది. ఈ కారణంగా, దేశీయ ఇంటర్నెట్ సేవలు విస్తరించడంతోపాటు ఖర్చులు తగ్గే అవకాశాలు ఉన్నాయి.

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) నుంచి అందిన తాజా సమాచారం ప్రకారం, దేశంలో ప్రస్తుతం 1.98 కోట్లకు పైగా ఫిక్స్‌డ్ లైన్ బ్రాడ్‌బ్యాండ్ చందాదారులు ఉన్నారు. దేశంలోని గృహాలకు ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించడానికి బ్రాడ్‌బ్యాండ్ కంపెనీలు సంపాదించిన సర్దుబాటు చేసిన స్థూల రాబడి (ఎజిఆర్) పై లైసెన్స్ ఫీజును తగ్గించేలా ఈ కొత్త ప్రతిపాదనలు ఉండనున్నట్టు తెలుస్తున్నది. 

ఫిక్స్‌డ్ లైన్ బ్రాడ్‌బ్యాండ్ సేవలకు అంచనా లైసెన్స్ ఫీజు ప్రస్తుతం 8 శాతంగా.. ఏడాదికి రూ 880 కోట్లుగా అంచనా వేస్తున్నారు. లైసెన్స్ ఫీజును సంవత్సరానికి రూ.1 కు పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనకు ఇంకా కేబినెట్ అనుమతి రాలేదు. 

ఈ ప్రతిపాదన వల్ల ప్రభుత్వానికి సుమారు రూ.592.7 కోట్ల నష్టం వాటిల్లుతుందని నిపుణులు భావిస్తున్నారు. దీనివల్ల డొమెస్టిక్‌ నెట్‌వర్క్‌లను అందించే బ్రాడ్‌బ్యాండ్ కంపెనీల ఆదాయంలో 10 శాతం పెరుగుదల ఉంటుంది.

ఈ ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదించినట్లయితే, ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్, వొడాఫోన్-ఐడియా, భారతీయ ఎయిర్టెల్ అతిపెద్ద లబ్ధిదారులుగా ఉంటాయి. బీఎస్ఎన్ఎల్ కూడా దీని నుంచి ప్రయోజనం పొందుతుంది. ఇంటి బ్రాడ్‌బ్యాండ్ చౌకగా ఉండటానికి మాత్రమే ఈ ప్రతిపాదనను తీసుకువస్తున్నట్టుగా నిపుణులు చెప్తున్నారు.