చైనా సరిహద్దులో వేగంగా రహదారుల నిర్మాణం 

భారత, చైనా దళాల మధ్య హింసాత్మక ఘర్షణల అనంతరం చైనా సరిహద్దులో రహదారుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. సరిహద్దు వెంబడి 32 ప్రధాన రహదారులపై పనులు ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. 

ఈ సమావేశానికి కేంద్ర ప్రజా పనుల విభాగం, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ సహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రస్తుతం భారత్-చైనా సరిహద్దులో మొత్తం 73 రోడ్లు నిర్మిస్తున్నారు. సరిహద్దులో ప్రస్తుత ఉద్రిక్తతల దృష్ట్యా, ఈ 32 ముఖ్యమైన రహదారులను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఇవి ఇప్పుడు మొదటి ప్రాధాన్యత అంశంగా పనులు చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ రహదారి ప్రాజెక్టులతో అనుసంధానించబడిన అన్ని ఏజెన్సీలు ఈ పనులను పూర్తి చేయడంలో పూర్తి సహకారాన్ని అందిస్తాయి. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నాయకత్వంలో 73 రోడ్లలో సీపీడబ్ల్యూడీ 12 రోడ్లపై పనిచేస్తోంది. 61 రోడ్లపై పనులు పూర్తి చేయడంలో బోర్డర్ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌ పాల్గొంటుంది. 

అన్ని సరిహద్దుల్లో మౌలిక సదుపాయాల సంబంధిత పనులకు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. లడఖ్‌లో బోర్డర్‌ రోడ్స్ ఆర్గనైజేషన్‌ నిర్మిస్తున్న కనీసం మూడు రోడ్లు వ్యూహాత్మక కోణం నుండి ముఖ్యమైనవి. అయితే, ఈ సరిహద్దు ప్రాంతాల్లో రోడ్లు కాకుండా, విద్యుత్, ఆరోగ్యం, టెలికం, విద్య కూడా ప్రభుత్వ ప్రాధాన్యత జాబితాలో ఉన్నాయి.

హోం మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఇటీవలి కాలంలో భారత-చైనా సరిహద్దులోని ప్రాంతాలలో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం దృష్టిసారించింది. 2008-17 మధ్య 230 కిలోమీటర్ల రోడ్లు మాత్రమే నిర్మించారు. కాగా, 2017-20 మధ్య 470 కి.మీ రోడ్లు నిర్మించబడ్డాయి.